తెలంగాణ పగటికలేనా?

 

 

 

తెలంగాణవాసులు అమాయకులంటారు. కేంద్రం తెలంగాణ ఇస్తున్నామని ప్రకటించగానే నిజంగానే తెలంగాణ వచ్చేస్తుందని తెలంగాణ నాయకులు సంబరపడిపోతున్నారు. భవిష్యత్తులో తమకు వస్తాయని భావిస్తున్న పదవుల గురించి పగటి కలలు కంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే తెలంగాణవాసులు అమాయకులేనని నిర్ధారణ చేసుకోవాల్సి వస్తోంది. కాంగ్రెస్ పార్టీ తాను ఆడే పొలిటికల్ గేమ్‌లో తెలంగాణ ఉద్యమాన్ని ఒక పావులా ఉపయోగించుకుంటోంది. ఈ వాస్తవాన్ని తెలంగాణ బిడ్డలు అర్థం చేసుకోలేకపోవడం దురదృష్టకరమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

తెలంగాణ ఇచ్చేస్తున్నామన్న పేరు మీద కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభిప్రాయ సేకరణలు, కమిటీలు, నివేదికలు, సంప్రదింపులు, లీకులు.. ఇవన్నీ తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నాల్లో భాగమేనని అంటున్నారు. ఎన్నికల వరకూ ఈ ప్రక్రియను సాగదీసీ, తెలంగాణ ఇవ్వకుండానే ఎన్నికలకు వెళ్ళే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ వుందని చెబుతున్నారు. ఎట్టిపరిస్థితులలోనూ ఎన్నికలకు ముందు తెలంగాణ వచ్చే అవకాశం లేదు. ఎన్నికల తర్వాత పరిస్థితి ఎలా వుంటుందో ఎవరూ చెప్పలేరు. ఎన్నికలకు ముందే తెలంగాణ ఇస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కంటే టీఆర్ఎస్ పార్టీయే ఎక్కువగా లాభపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే, రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌కి మేలు జరిగే అవకాశం లేదు. అలాంటప్పుడు ఎందుకు విభజించాలి?



తెలంగాణ ఇచ్చేశాక టీఆర్ఎస్‌ని కాంగ్రెస్ పార్టీ ఎంతమాత్రం కంట్రోల్ చేయలేదు. ఆ పార్టీ ద్వారా రాజకీయ లబ్ధి పొందే అవకాశం వుండదు. కాబట్టి ఎన్నికల వరకూ ఇష్యూ సాగదీసి, ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తెలంగాణ ఇచ్చేస్తుందని ప్రతిపాదించే అవకాశం వుంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అలా చేయడం ద్వారా 2014 ఎన్నికలలో టీఆర్ఎస్‌తో మరోసారి ఎన్నికల పొత్తు కుదుర్చుకునే పథక రచనలో కాంగ్రెస్ వుందని అంటున్నారు. అన్ని అంశాలనూ పరిశీలిస్తే... తెలంగాణ వచ్చేస్తోందని తెలంగాణ నాయకులు కంటున్న కలలు పగటి కలలలా మిగిలే అవకాశాలే ఎక్కువని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.