పాలమూరు మంత్రుల్లో గుబులు... ఒక్కటి చేజారినా పదవి పోయినట్లే..!

మున్సిపాలిటీల్లో గెలవకపోతే మంత్రి పదవులు ఊడుతాయంటూ గులాబీ బాస్ చేసిన హెచ్చరిక మంత్రులకు దడ పుట్టిస్తోంది. దాంతో, కేసీఆర్ వార్నింగ్ ను సవాల్ గా తీసుకుంటున్న మంత్రులు... పార్టీ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు పట్టువదలని విక్రమార్కుల్లా పనిచేస్తున్నారు. తలో పార్లమెంట్ నియోజకవర్గాన్ని... పంచుకుని అభ్యర్థుల గెలుపు బాధ్యతను తమ భుజాలపై వేసుకున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‍ హెచ్చరిక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ లకు సవాల్ మారింది. ఉమ్మడి జిల్లాలోని 17 పురపాలికల గెలుపు బాధ్యతంతా వీరిద్దరిపైనే పడింది. ఏ ఒక్క పురపీఠం చేజారినా వేటు తప్పదన్న భావనతో ఇద్దరు మంత్రులు తమ పరిధిలో ఉన్న మున్సిపాలిటీల్లో సీరియస్ గా వర్క్ చేస్తున్నారు. అయితే, టికెట్లు దక్కనివారిని బుజ్జగించడం, వర్గ విభేదాలను క్లియర్ చేయడం పెద్దతలనొప్పిగా మారింది. ఇక, పెద్ద మున్సిపాలిటీ అయిన మహబూబ్ నగర్ లో పోటీ ఎక్కువగా ఉంది. ఇక్కడ టీఆర్‍ఎస్‍ కు బీజేపీ గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే, మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో బీజేపీకి మంచి ఓట్లు రావడంతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ గుండెల్లో గుబులు నెలకొంది.

ఇక, మంత్రి నిరంజన్‍ రెడ్డి నాగర్‍కర్నూల్‍ పార్లమెంటు సెగ్మెంట్ కే పరిమితమయ్యారు. వనపర్తి, కొల్లాపూర్‍, అలంపూర్‍ మున్సిపాలిటీలపై ఎక్కువగా దృష్టి పెట్టారు. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ గెలుపు బాధ్యతను స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‍రెడ్డిపై వదిలిపెట్టారు. గద్వాల్ లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‍రెడ్డితో ఉన్న విబేధాల కారణంగా అటువైపు మంత్రి నిరంజన్ రెడ్డి చూడడంలేదని తెలుస్తోంది. నాగర్ కర్నూల్, గద్వాల మున్సిపాలిటీలు వదిలేసి వనపర్తి, అలంపూర్, ఐజ, కొల్లాపూర్‍ లో టీఆర్ ఎస్ గెలుపు కోసం నిరంజన్ రెడ్డి శ్రమిస్తున్నారు. అయితే, ఈ ఇద్దరు మంత్రులు ఎన్ని మున్సిపాల్టీల్లో గులాబీ జెండా ఎగరవేసి అధిష్టానానికి గిఫ్ట్ ఇస్తారోనన్న చర్చ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో విస్త్రతంగా చర్చ జరుగుతోంది.