విభజనుల గుండెల్లో రాయి!

 

 

 

రాష్ట్ర విభజనుల గుండెల్లో రాయి పడింది. ఆ రాయిపేరు ‘రాయల తెలంగాణ’. కేంద్ర ప్రభుత్వం దర్శకత్వంలో రూపొందిన అట్టర్ ఫ్లాప్ మూవీ ‘విభజన’లో సరికొత్త ట్విస్ట్ లేటెస్టుగా తెరమీదకి వచ్చింది. రాయల తెలంగాణ ప్రతిపాదన మీద కేంద్ర ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించింది. అది కూడా రాయలసీమ మొత్తాన్నీ తెలంగాణలో కలపకుండా కర్నూలు, అనంతపురం జిల్లాలనే తెలంగాణలో కలిపే ఎందుకూ పనికిరాని ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం వుంది.

 

 

తనకు వచ్చిన చెత్త ఐడియా గురించి రాష్ట్రంలోని విభజనవాదుల నుంచి అభిప్రాయ సేకరణ మొదలుపెట్టింది. కొంతమందికి ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారుల చేత ఫోన్లు చేయించి రాయల తెలంగాణ మీద మీ అభిప్రాయం ఏంటని అడిగించింది. సహజంగానే విభజనులందరూ రాయల తెలంగాణ అనగానే మరో లభిప్రాయం లేకుండా నో చెప్పేశారు. నో అని అయితే చెప్పారుగానీ, ఆ తర్వాత నుంచి విభజనుల గుండెల్లో రాయి పడింది. కంటికి కునుకు దూరమైంది. కేంద్ర ప్రభుత్వం ఎక్కడ రాయల తెలంగాణ వైపు పూర్తిగా మొగ్గి టోటల్‌గా తెలంగాణ ఆశలను వమ్ము చేస్తుందోనని భయం పట్టుకుంది. టీఆర్ఎస్ నాయకులయితే రాయల తెలంగాణ అనే మాట గుర్తొచ్చినా ఉలిక్కిపడుతున్నారు.

 



నిజంగా రాయల తెలంగాణ అనేది కార్యరూపంలోకి వస్తే తెలంగాణలో తమ పార్టీ బలం గణనీయంగా తగ్గే అవకాశాలున్నాయి. కరడుగట్టిన విభజనవాదులు బోలెడన్ని తలనొప్పులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన సంపూర్ణ తెలంగాణ అనే నినాదాన్ని నొక్కి వక్కాణిస్తున్నారు. ఎవరెంతగా వక్కాణించినా కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రస్తుతం రాయల తెలంగాణ మీద మోజును ప్రదర్శిస్తోంది. తెలంగాణకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో జోరుగా మంతనాలు సాగిస్తోంది. అభిప్రాయాలు సేకరిస్తోంది. ఈ వ్యవహారమంతా చూస్తుంటే విభజన ప్రక్రియను మరింత ఆలస్యం చేసి తర్వాత చేతులు ఎత్తేసే ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వం ఉందన్న అనుమానాలు తెలంగాణ వాదులు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకైనా మంచిదని పది జిల్లాల తెలంగాణ కాకుండా ఇంకోరకం తెలంగాణ ఇస్తామంలో మరో పోరాటానికి సిద్ధమవుతామని బెదిరింపులు మొదలుపెట్టారు.