మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి... హైకోర్టుపైనే ఆర్టీసీ కార్మికుల ఆశలు

దాదాపు నెలన్నరగా సమ్మె చేస్తున్నా, ప్రభుత్వం దిగిరాకపోవడంతో, పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడితోపాటు నిరవధిక దీక్షలకు సిద్ధమవుతోంది. జేఏసీ నేతలు అశ్వద్ధామరెడ్డి, రాజిరెడ్డి, లింగమూర్తి, సుధలు దీక్షలో కూర్చోనున్నారు. ఇక, ఛలో ట్యాంక్ బండ్ సందర్భంగా ఆర్టీసీ కార్మికులపై జరిగిన పోలీసుల దౌర్జన్యకాండను అన్ని కూడళ్లలో ఫొటోలను ప్రదర్శించాలని జేఏసీ నిర్ణయించింది. అలాగే, జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నారు. అదేవిధంగా 18న సడక్ బంద్‌కు పిలుపునిచ్చింది ఆర్టీసీ జేఏసీ.

ఇదిలాఉంటే, హైకోర్టుపైనే ఆర్టీసీ కార్మికులు నమ్మకం పెట్టుకుంటున్నారు. హైకోర్టు ఆదేశాలతోనైనా ప్రభుత్వం దిగొస్తుందని ఆశతో ఎదురుచూస్తున్నారు. మీరు తేల్చుతారా... మమ్మల్ని తేల్చమంటారా అంటూ గత విచారణలో ప్రభుత్వాన్ని హెచ్చరించిన హైకోర్టు... ఈసారి అటోఇటో తేల్చేస్తుందని భావిస్తున్నారు. దాంతో  విచారణపై తీవ్ర ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు.