మహిళ జీవితంలో నిప్పులు పోసిన తెలంగాణ సర్కార్

కంపెనీలు తమ ప్రొడక్ట్ క్వాలిటీ మీద కంటే ప్రకటనల మీదే ఎక్కువ శ్రద్ద చూపుతాయి.. అప్పుడే కదా వాళ్ళ కంపెనీ ప్రొడక్ట్ నలుగురు కొని నాలుగు డబ్బులు వచ్చేది.. అయితే ఈ ప్రకటనల పిచ్చి వ్యాపార రంగంలోనే కాదు, రాజకీయరంగంలో కూడా ఉంటుంది.. నాయకులు ఎన్నికల దగ్గర పడుతుంటే తమని తాము ప్రమోట్ చేసుకుంటూ ప్రకటనలు విడుదల చేసుకుంటారు.. అయితే అధికార పార్టీలు మాత్రం ప్రతి ప్రభుత్వ పథకానికి భారీగా ప్రకటనలు ఇస్తున్నాయి.. కొన్ని సార్లు ఈ ప్రకటనలు ప్రభుత్వాన్ని విమర్శలు పాలు చేస్తున్నాయి.. తాజాగా తెలంగాణ ప్రభుత్వానికి కూడా అలాంటి అనుభవమే ఎదురైంది.

 

 

రీసెంట్ గా తెలంగాణ ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభోత్సవం ప్రకటనలు ఇచ్చింది.. ఆ ప్రకటనల్లో ఓ ఫొటోలో ఒక మహిళ బాబుని ఎత్తుకొని ఉండగా పక్కన భర్త ఉన్నాడు.. మరో ఫొటోలో అదే మహిళ పక్కన మరో వ్యక్తి భర్త అన్నట్టుగా ఇంకో ప్రకటన ఇచ్చారు.. దీంతో ఈ ప్రకటనల పై బాగా ఛలోక్తులు వినిపించాయి.. ఒక మోడల్ ఫొటోతో ఇలా రెండు ప్రకటనలు చేసారుగా అంటూ నవ్వుకున్నారు.. కానీ నిజానికి ఆమె మోడల్ కాదు ఓ సాధారణ మహిళ.. ఈ ప్రకటనల మూలంగా నవ్వులు పాలైంది ప్రభుత్వం కాదు, ఓ మహిళ జీవితం.. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తొగ్రాయికి చెందిన పద్మ తన భర్త ఫొటోను మార్చడంపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది.. ప్రస్తుతం యాదగిరి సమీపంలోని కొంగవల్లిలో ఉంటున్న తమ వద్దకు మూడు సంవత్సరాల క్రితం కొందరు వచ్చి కుట్టు మిషన్ లకి లోనులు ఇప్పిస్తామని ఫొటోలు తీసుకున్నారని ఆమె చెబుతోంది.

 

 

అయితే ఆ ఫోటోలు తీసుకున్నప్పటి నుండి తమకు రోజూ ఎదో ఒక అవమానం ఎదురవుతూనే ఉందని అసలు పొలమే లేని తమకు రైతుబందు పధకం కింద డబ్బులోచ్చాయని రూ. 4 వేలు ప్రభుత్వం నుంచి అందుకుని ఆనందంగా ఉన్నామని , ఆపై తాము కాపుసారా కాచుకుని, దాన్ని తాగేవాళ్లమని, ఇప్పుడు సారా కాయడం లేదని, ఆనందంగా ఉన్నామని చెబుతూ పేపర్లో ప్రకటన ఇచ్చారని తెలిపింది.. కంటివెలుగు ప్రారంభం సమయంలో తన భర్త ఫొటో బదులు వేరొకరి ఫొటో పెట్టారని ఆమె ఆరోపించింది. దాన్ని చూసిన తమ ఇంటిలో రోజూ గొడవలు అవుతున్నాయని రోడ్డు మీద అయితే అసలు తాను తలెత్తుకు తిరగలేకపోతున్నానని వాపోయింది.. ఈ విషయంలో అసలు తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యమని ఆ మహిళ వ్యక్తం చేసింది.. ప్రకటనల కోసం మహిళను ఇంత క్షోభకు గురిచేసిన ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా ఆమె గోడుని ఆలకిస్తారో లేదో.