ఎమ్మార్వోని కాదు ఇక పీఆర్వోని కలవాలి.. రెవెన్యూ కార్యాలయాల్లో కొత్త పద్ధతి

 

ఎమ్మార్వో కార్యాలయాలకు వెళ్తున్నారా.. తహసీల్దార్ ఆర్డీవోలను కలవాలనుకుంటున్నారా.. అయితే ఇక పై వారిని నేరుగా కలిసే అవకాశం లేదు. తహసిల్దార్ విజయా రెడ్డి హత్య అనంతరం అధికారులకు.. ప్రజలకు.. మధ్య కొత్త వ్యవస్థ రాబోతుంది. వారి మధ్య పీఆర్వో విధానం రాబోతుంది. తహసిల్దార్ విజయరెడ్డి హత్యానంతరం ఎమ్మార్వో కార్యాలయాల్లో ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలకు జవాబుదారీగా ఉండేందుకు ఎమ్మార్వో, ఆర్డీవో కార్యాలయాల్లో పీఆర్వోలను నియమించటానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

ఎన్నో సమస్యలతో రెవెన్యూ కార్యాలయాలకు వచ్చే వారు నేరుగా అధికారులను కలవకుండా పీఆర్వోలను కలిసే విధానం రాబోతుంది. రెవెన్యూ కార్యాలయాలకు వచ్చే ప్రజలు మొదటగా పీఆర్వోను కలుస్తారు. తమ సమస్యలు ఎంత వరకు వచ్చిందని వారిని అడుగుతారు. వారి వినతి పత్రాలను పీఆర్వోలు అధికారులకు అందజేస్తారు. పరిష్కారం ఎంత వరకు వచ్చిందో తెలుసుకొని ప్రజలకు లిఖిత పూర్వకంగా సమాధానం ఇస్తారు. 

పీఆర్వో విధానంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సమస్యలు సరిగ్గా పరిష్కరిస్తే ఎందుకు దాడులు జరుగుతాయంటున్నారు సామాజిక కార్యకర్త ఆర్ శ్రీనివాస్.పీఆర్వో వ్యవస్థను ప్రవేశ పెట్టడం చాలా సంతోషకరమైన వార్త అలాగే ప్రజలు అధికారులు.. తోటి సిబ్బంది కూడా సహకరించాలి. సిబ్బంది కూడా ప్రజలతో సహకరించి.. ఏ సమస్య ఉన్నా క్షుణ్ణంగా వాళ్లు పరీక్షిస్తేనే ఆ సమస్య పరిష్కారమవుతుందని శీనివాస్ వెల్లడించారు. 

మరోవైపు విజయారెడ్డి హత్యానంతరం రెవెన్యూ అధికారులకు భద్రత అవసరమని ముఖ్యంగా మహిళా రెవెన్యూ ఆఫీసర్లకు భద్రత తప్పనిసరి అంటున్నారు. ఇంకో వైపు ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అధికారులకు , మళ్లీ పీఆర్వోలు ఎందుకంటున్నారు మరికొంతమంది అధికారులు. ప్రజా సమస్యలు పరిష్కరించడం కొరకు నియమితులైన అధికారులు వాటిని పరిష్కరించకుండా పీఆర్వో వ్యవస్థ పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు అంటున్నారు.ప్రజల మనస్తత్వం మారనంత వరకు ఎంత సెక్యూరిటీ ఎన్ని చట్టాలు వచ్చినా ఉపయోగం లేదు అంటున్నారు మరికొందరు అధికారులు. వ్యవస్థలోని కొన్ని లోపాలు కూడా దీనికి కారణమంటున్నారు.