ఆర్టీసీ సమ్మె ఓ కొలిక్కి రానుందా,చర్చలు సఫలం కానున్నాయా?

 

ఆర్టీసీ సమ్మె అనేక మలుపులు తిరుగుతోంది. ఇప్పటి దాకా కార్మిక సంఘాల కార్యాచరణ, ప్రతిపక్ష పార్టీల మద్దతు, విద్యార్థి, ప్రజా సంఘాల ఆందోళనతో ఉద్రిక్తంగా మారిన ఆర్టీసీ సమ్మె ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఆర్టీసీ సమ్మెపై కేంద్రం ఆరా తీయడంతో కథ మరో మలుపు తిరిగింది. ఆర్టీసీ జేఏసీ నేతలు నిన్న గవర్నర్ తమిళ సాయిని కలిసి సమ్మెకు సంబంధించిన వివరాలు అందజేశారు. వెంటనే ఢిల్లీ నుంచి గవర్నర్ కు పిలుపందింది. సమ్మె వివరాలతో వెంటనే ఢిల్లీకి రావాలంటూ కేంద్ర హోంశాఖ గవర్నర్ కి సందేశాన్ని పంపించింది. దీంతో గవర్నర్ తమిళ సాయి ఢిల్లీకి బయల్దేరారు. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రధాని మోదీ, సాయంత్రం నాలుగు గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో గవర్నర్ సమావేశం అవుతారు. ఆర్టీసీ సమ్మె, ఆత్మహత్యలూ రాష్ట్రంలోని పరిస్థితుల్నే గవర్నర్ కేంద్రానికి వివరించే అవకాశం కనిపిస్తోంది. 

ఇటు ఆర్టీసీ సమ్మె సమస్యను పరిష్కరిస్తామని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు ప్రకటించారు. ఈ నేపధ్యంలో ఆయన ఇవాళ సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యే అవకాశం కనిపిస్తోంది. కేకే ప్రగతి భవన్ కు బయల్దేరి వెళ్లనున్నారు. సమ్మెకు సంబంధించిన విషయాలపైనా ఆయన కేసీఆర్ తో చర్చించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి ఆదేశిస్తే తాను సమస్యల పరిష్కారం కోసం పని చేస్తానని తెలియజేశారు కేకే. ఇటు ఆర్టీసీ జేఏసీ కూడా కేకే మధ్యవర్తిత్వాన్ని అహ్వానించారు. దీంతో సీఎంతో భేటీ తర్వాత కేకే ఆర్టీసీ జేఏసీ నేతలతో కూడా మాట్లాడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఆర్టీసీ సమ్మెపై హై కోర్టులో దాఖలైన పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది. ఆర్టీసీ సమ్మెకు సంబంధించిన పూర్తి నివేదిక సమర్పించాలని ఇప్పటికే ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్ట్, ఇటు ఆర్టీసీ సంఘాలు కూడా ఆత్మహత్యలపై కోర్టుకు నివేదిక ఇవ్వనున్నాయి .ఇటు సమ్మె, ప్రజల సమస్యల పై ఇవాళ మరో పిటిషన్ కూడా హై కోర్టులో దాఖలు అయ్యే అవకాశం కనిపిస్తోంది.అసలు ఈ సమ్మే పై చర్చ సఫలం కానుందా లేదా అనేది వేచి చూడాలి.