తెరాసలో సీఎం లొల్లి!

 

 

 

వస్తుందో రాదో తెలియని తెలంగాణకి ముఖ్యమంత్రి ఎవరు అవ్వాలన్న చర్చ తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్ర స్థాయిలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీ కాంగ్రెస్‌లో దాదాపు ఇరవై మంది నాయకులు తెలంగాణ సీఎం తానేనని కలలు కంటున్నారు. టీ కాంగ్రెస్‌లో పరిస్థితి ఇలా వుంటే తెలంగాణ రాష్ట్ర సమితిలో ఈ అంశం ముదురు పాకానపడింది. తెలంగాణకి మా అన్న సీఎం అంటే మా అన్న సీఎం అని హరీష్ రావు, కేటీఆర్ వర్గాల మధ్య అంతర్యుద్ధం మొదలైంది.

 

తాజాగా కొంతమంది పార్టీ నాయకులు తెలంగాణకి హరీషే సీఎం అని బాహాటంగా ప్రకటించడంతో ఈ రెండు వర్గాల మధ్య లొల్లి ముదిరింది. తెలంగాణ సీఎం పదవి మీద మొదటి నుంచి హరీష్ రావు, కేటీఆర్‌లకు కన్నుంది. ఒకరి లక్ష్యానికి మరొకరు అడ్డుగా వున్నారు కాబట్టి ఈ బావాబామ్మర్దులిద్దరికీ మొదటి నుంచీ ఒకరంటే మరొకరికి పడదు. ఒకరి ప్రస్తావన మరొకరు తేరు. ఒకరిమీద వచ్చిన అవినీతి ఆరోపణలను మరొకరు ఖండించరు. ఇద్దరూ ఒకే సందర్భంలో చాలా అరుదుగా కనిపిస్తారు. రాష్ట్రాన్ని చీల్చాలని ఉద్యమం చేస్తున్న టీఆర్ఎస్ ఈరకంగా ఏనాడో చీలిపోయింది. వీళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదర్చాలని కేసీఆర్ ప్రయత్నించి విఫలమయ్యారు. ఇద్దర్లో ఎవర్ని జాగో అనాలో ఎవర్ని భాగో అనాలో అర్థంకాక, ఫామ్‌హౌస్‌లో తపస్సు చేసినా పరిష్కారం లభించక ఇద్దరి మధ్యన ఇరుక్కుపోయి నలిగిపోతున్నారు.


కేసీఆర్‌లోని తండ్రి మనసు కొడుకు వైపే మొగ్గుచూపుతున్నా, దాన్ని బయటపెట్టలేక బాధపడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణకి తొలి ముఖ్యమంత్రి హరీష్‌రావేనని ఆయన వర్గీయులు బాహాటంగా ప్రకటిస్తూ వుండటం టీఆర్ఎస్‌లో వున్న ఆల్రెడీ వున్న అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. హరీష్ వర్గం దూకుడు కేటీఆర్ వర్గానికి ఎంతమాత్రం నచ్చడం లేదు. ఈ దూకుడుకు కళ్ళెం వేయాలని భావిస్తున్నారు. తెలంగాణ వస్తే దళితుడే తొలి ముఖ్యమంత్రి అని కేసీఆర్ ప్రకటిస్తే, ఆయన కొడుకు, మేనల్లుడు మాత్రం సీఎం నేనంటే నేనంటూ లొల్లి చేస్తున్నారు. తెలంగాణ రాకముందే, వస్తుందో లేదో కూడా తెలియక ముందే పరిస్థితి ఇలా వుందంటే,  పొరపాటున తెలంగాణ వచ్చేస్తే పరిస్థితి ఇంకెలా వుంటుందో!