తెలంగాణ బడ్జెట్.. రైతులకు గుడ్ న్యూస్

 

2019-20 సంవత్సరానికి రూ.1,82,017 కోట్లతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌‌ను సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన కారణంగా ఎన్ని నిధులు వస్తాయో స్పష్టంగా తెలియదన్నారు. అందుకే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రంలోనూ పూర్తి బడ్జెట్ ప్రవేశపెడతామని వెల్లడించారు. ఇది తెలంగాణ రాష్ట్రానికి ఆరవ బడ్జెట్‌ అని చెప్పారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రజలు సహకారం అందిస్తున్నారని తెలిపారు. తెలంగాణ ఆవిర్భావానికి ముందు గుజరాత్‌, కేరళ అభివృద్ధి గురించే దేశవ్యాప్తంగా చర్చ జరిగేదని, ప్రస్తుతం తెలంగాణ అభివృద్ధిపై చర్చ జరుగుతోందని అన్నారు. తెలంగాణ అనుసరిస్తున్న ప్రణాళిక దేశంలో చర్చకు కేంద్ర బిందువైందని చెప్పారు. తెలంగాణ ఆవిర్భవించినప్పుడు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాం. అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్‌ అందిస్తున్నామన్నారు. రైతుల్లో నిరాశను తొలగించామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు.

తెలంగాణ రైతులకు కేసీఆర్‌ శుభవార్త చెప్పారు. 2018 డిసెంబరు 11వ తేదీలోగా తీసుకున్న రైతు రుణాలు రూ.లక్ష వరకూ మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ బడ్జెట్‌లో వ్యవసాయాభివృద్ధి కోసం రూ.20,107కోట్లు కేటాయించారు. రైతు బంధు సాయం కింద ఎకరానికి రూ.10వేలు అందిస్తుండగా, ఇందుకోసం రూ.12వేల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. రైతు బీమా కోసం రూ.650కోట్లు కేటాయించిన కేసీఆర్‌ ప్రభుత్వం.. నీటిపారుదల శాఖకు రూ.22,500కోట్లు కేటాయించింది.

తెలంగాణ బడ్జెట్‌ ముఖ్యాంశాలు:

  • వ్యవసాయ శాఖకు రూ.20,107 కోట్లు
  • రైతు రుణమాఫీకి రూ.6వేల కోట్లు
  • రైతు బంధుకు రూ.12 వేల కోట్లు
  • రైతు బీమా రూ.650 కోట్లు
  • నీటిపారుదలశాఖకు రూ.22,500కోట్లు
  • నిరుద్యోగ భృతికి రూ.1,810 కోట్లు
  • ఎస్సీల అభివృద్ధికి రూ.16,581 కోట్లు
  • ఎస్టీల అభివృద్ధికి రూ.9,827 కోట్లు
  • మైనార్టీల సంక్షేమానికి రూ.2004 కోట్లు
  • ఈఎన్‌టీ, దంత పరీక్షలకు రూ.5,536 కోట్లు
  • ఆసరా పెన్షన్లకు రూ.12,067 కోట్లు
  • కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌కు రూ.1450 కోట్లు
  • రూపాయికి కిలో బియ్యం పథకానికి రూ.2,744 కోట్లు
  • దివ్యాంగుల పెన్షన్లకు రూ.12వేల కోట్లు
  • ఎంబీసీ కార్పోరేషన్‌కు రూ.1000 కోట్లు