కేసీఆర్ పుట్టినరోజుకు ఆశ్చర్యకరమైన ప్లాన్ చేస్తున్న టీఆర్ఎస్ నేతలు

తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు తెలంగాణ ప్రజలకు పండుగరోజు. అందుకే కేసీఆర్ కు మొక్కల పండగతో శుభాకాంక్షలు చెప్పేందుకు గులాబీదళం సిద్ధమైంది. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ చాలెంజ్ ఊపందుకుంది. ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన మొక్కలు నాటే కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రముఖుల్ని భాగస్వామ్యం చేసింది. సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు అందరు పాల్గొనడంతో అది విశ్వవ్యాప్తమైంది. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా నెక్లెస్ రోడ్డులోని జల విహార్ లు ఏర్పాటు చేసిన ఉచిత హెల్త్ క్యాంపును స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభిస్తారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మొక్కలు నాటుతారు. కేసీఆర్ జీవితక్రమాన్ని వివరించి ఫొటో ఎగ్జిబిషన్ ను ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ప్రారంభిస్తారు. ప్రభుత్వ పథకాల ఎల్ఈడి ప్రదర్శనశాలను హోం మంత్రి మహముద్ అలీ ప్రారంభిస్తారు. ఎంపీ సంతోష్ కుమార్ వికలాంగులకు వీల్ చైర్స్ పంపీణీ చేస్తారు. సీఎం పుట్టినరోజు పురస్కరించుకొని ఎంపీ కేశవరావు భారీ కేక్ కట్ చేయనున్నారు. అటు ఏపీలో టీ ఆర్ ఎస్ నాయకులు ఘనంగా కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు జరుపుకోనున్నారు.

విజయవాడ దుర్గగుడిలో పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఆంధ్రా టీ ఆర్ ఎస్ భవన్ లో కేక్ కటింగ్ చేస్తారు. కేసీఆర్ పుట్టినరోజుకి హైదరాబాద్ లో ఈసారి అంతా సందడిగా మారనుంది. మెట్రో పిల్లర్లపైన ఎటు చూసినా కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షల ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. నగరమంతటా హోర్డింగులు కనిపిస్తున్నాయి. అందరి దృష్టిని ఆకర్షించేందుకు ఇన్నోవేటివ్ గా ప్రోగ్రామ్స్ తయారు చేస్తున్నారు. వి లవ్ కేసీఆర్ పేరుతో కొన్ని కార్యక్రమాలు చేస్తుండగా, పెయింటింగ్స్ చిత్రకళా ప్రదర్శనలు కూడా జరుగుతున్నాయి. జంటనగరాల్లోని కవలలందరినీ ఒకే చోటుకు చెరిచింది మరో సంస్థ. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఈసారి కేసీఆర్ పుట్టినరోజుకు రెట్టించిన ఉత్సాహంతో కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. గజ్వేల్ లో రెండు వేల ఆరు వందల మంది మొక్కలు పట్టుకొని అరవై ఆరు వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో కేసీఆర్ రూపంలో నిలబడ్డారు. ఇక విదేశాల్లో కూడా టీ ఆర్ ఎస్ ఎన్నారై శాఖలు కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు జరుపుతున్నాయి.