తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. సీఏఏ ను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం!!

దేశవ్యాప్తంగా సీఏఏ వ్యతిరేక ఆందోళనలు వెల్లువెత్తుతున్న తరుణంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని తెలంగాణ క్యాబినెట్ కేంద్రాన్ని కోరింది. పౌరసత్వ విషయంలో మతపరమైన వివక్ష చూపరాదని కేంద్రానికి సూచించింది. దీనివల్ల లౌకికత్వం ప్రమాదములో పడే పరిస్థితి ఉత్పన్నం అవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. కేరళ, పంజాబ్, రాజస్థాన్, బెంగాల్ తరహాలోని సీఏఏ ను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని నిర్ణయించింది. 

పల్లె ప్రగతి తరహాలో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. దీనికి సంబంధించిన విధి విధానాల ఖరారు చేసేందుకు మంగళవారం ప్రగతి భవన్ లో రాష్ట్రస్థాయి మునిసిపల్ సదస్సు నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో చక్కని నగర జీవన వ్యవస్థ సాగడానికి పట్టణ ప్రగతి కార్యక్రమంతో మంచి పునాది ఏర్పడాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ఈ నెల 24న అన్ని పట్టణాలు, నగరాల్లో పది రోజుల పాటు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వార్డు యూనిట్ గా పట్టణ ప్రగతి నిర్వహిస్తారు, ప్రతి వార్డుకు ఓ ప్రత్యేక అధికారిని నియమిస్తారు. ప్రతి మునిసిపాలిటీ కార్పొరేషన్ లు, వార్డుల వారీగా నాలుగు చొప్పున ప్రజా సంఘాలు ఏర్పాటు చేసే ప్రక్రియను అయిదురోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. జీ హెచ్ ఎం సీ కి వెంటనే డెబ్బై ఎనిమిది కోట్లు ఇతర మునిసిపాలిటీలు, కార్పొరేషన్ లకు డెబ్బై కోట్ల రూపాయల నిధులను విడుదల చేయాలని నిర్ణయించారు. ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన నిధులు జనాభా ప్రాతిపదికన ఆయా పట్టణాలకు అందించాలి. ఈ విధంగా రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలకు నెలకు నూట నలభై ఎనిమిది కోట్ల రూపాయల చొప్పున నిధులు సమకూరుతాయి. పట్టణ ప్రగతిలో భాగంగా చేపట్టే పనులకు నిధుల కొరత ఉండకుండా చూడాలని నిర్ణయించారు. పట్టణ ప్రగతిలో పచ్చదనం పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించారు. 

రాజీవ్ స్వగృహ, అభయహస్తం, బంగారుతల్లి, వడ్డీ లేని రుణం వంటి పథకాల పరిస్థితిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి తదుపరి నిర్ణయం తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. రాజీవ్ స్వగృహ ఇళ్లను వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయించింది. విధి విధానాలు ఖరారు చేయడానికి చిత్ర రామచంద్రన్ అధ్యక్షతన రామకృష్ణారావు, అరవింద్ కుమార్ లు సభ్యులుగా అధికారుల కమిటీని నియమించింది. అభయహస్తం పథకం సమీక్ష బాధ్యతను మంత్రి టి హరీశ్ రావు, ఐఏఎస్ అధికారి సందీప్ సుల్తానియాలకు అప్పగించింది. తెలంగాణలో లోకాయుక్త చట్టంపై తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు కేబినెట్ ఆమోదించింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో లోకాయుక్త బిల్లు ప్రవేశపెట్టాలని కేబినెట్ నిర్ణయించింది.