చిన్నారి కథ విషాదాంతం..ముక్కలు ముక్కలుగా మృతదేహం

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చన్‌వెళ్లిలో ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిన చిన్నారి మీనా కథ విషాదాంతమైంది. బాలిక మరణించినట్లు మంత్రి మహేందర్ రెడ్డి ప్రకటించారు. చిన్నారిని కాపాడేందుకు 60 గంటల పాటు సిబ్బంది చేసిన ప్రయత్నం విఫలమైంది. గురువారం 40 అడుగుల లోతున ఇరుక్కుపోయిన చిన్నారి..శుక్రవారం సాయంత్రం బోరుబావిలో మోటారును వెలికి తీసినప్పటి నుంచి జాడ కనబడకుండా పోయింది. నిన్న ప్రత్యేక లేజర్ కెమురాలు, అత్యాధునిక మ్యాట్రిక్స్ వాటర్ ప్రూఫ్ ‌కెమెరాను తప్పించి..210 అడుగుల లోతు వరకు అన్వేషించినా చిన్నారీ ఆచూకీ శూన్యం. దీంతో పాపను ప్రాణాలతో కాపాడలేకపోయినప్పటికీ కనీసం కన్నవారికి చివరిచూపునైనా దక్కించాలనే ఉద్దేశ్యంతో ఎయిర్ ప్రెషర్ ద్వారా చిన్నారి మృతదేహాన్ని బయటకు తీయాలని ప్రయత్నించారు. ఈ సమయంలో బోరు బావి నుంచి చిన్నారి శరీరభాగాలతో పాటు దుస్తులు బయటకు వచ్చాయి. దీంతో పాప తల్లిదండ్రులతో పాటు బంధువులు, స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు.