కేసీఆర్ తో కయ్యమా? వియ్యమా? తేల్చుకోలేకపోతోన్న టీ బీజేపీ!

అమిత్ షా మరోసారి తెలంగాణకి వచ్చారు! హైద్రాబాద్ లో ఒక్క రోజు పాటూ బిజి బిజీ పర్యటన చేస్తున్నారు. అసలు ఇంత హడావిడి టూర్ తో ఆయన ఏం ఆశిస్తున్నారు? ఇదే ఇప్పుడు పెద్దగా సమాధానాలు చిక్కని ప్రశ్న!

 

 

ఏ పార్టీ అయినా తమ ప్రభుత్వం ఏర్పడాలనే పావులు కదుపుతూ వుంటుంది. కానీ, ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు దాదాపు అసాధ్యం. అంత బలహీనంగా వుంది పార్టీ పరిస్థితి. త్రిపురలో ఒక్క సర్పంచ్ కూడా లేకున్నా అధికారం చేపట్టామని బీజేపీ అభిమానులు వాదించవచ్చు. అయినా కూడా త్రిపుర, తెలంగాణ ఒక్కటి కాదు. ఇక్కడ టీఆర్ఎస్ లాంటి ప్రాంతీయ పార్టీ బలంగా వుంది. రెండో స్థానంలో కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీ కూడా తెలంగాణ వ్యాప్తంగా గట్టిగానే వుంది. ఇక మూడో స్థానానికి టీటీడీపీ, సీపీఎం, సీపీఐ లాంటి పార్టీలతో బీజేపీ పోటీ పడాల్సి వుంది. ఇటువంటి స్థితిలో కమలదళానికి మరో ఇబ్బందికర అంశం కూడా తెలంగాణలో వుంది!

 

 

అమిత్ షా గతంలో ఒకసారి తెలంగాణ పర్యటన చేసినప్పుడు కేసీఆర్ పైన ఘాటు విమర్శలే చేశారు. అందుకు ప్రతిగా స్వయంగా తెలంగాణ సీఎం ప్రతి దాడి చేశారు. కానీ, తరువాత రకరకాల సందర్భాల్లో పలువురు కేంద్ర మంత్రులు గులాబీ సర్కార్ ని మెచ్చుకుంటూ వస్తున్నారు. కేసీఆర్ పథకాల్ని బీజేపీ అగ్రనేతలు చాలా సందర్భాల్లో అభినందిస్తున్నారు. వీలైతే తమ పరిధిలో కాపీ చేస్తున్నారు కూడా! ఇదంతా చూస్తే … అసలు ఎన్డీఏలో లేనేలేని టీఆర్ఎస్ పట్లే దిల్లీ నేతల వైఖరి అనుకూలంగా వుంది. నాలుగేళ్లు కలిసున్న టీడీపీతో మాత్రం ఉప్పు నిప్పులా వుంది. ఇలా కేసీఆర్ గవర్నమెంట్ పై ఎందుకు మోదీ బృందం సానుకూలంగా వుంటోంది?

రానున్న ఎన్నికల్లో మోదీకి ఎంపీలు తక్కువ పడితే ఆదుకునే ఎన్డీఏ యేతర పార్టీల్లో ప్రధానమైనవి టీఆర్ఎస్, వైసీపీలే. పోలింగ్ కి ముందు కాకున్నా తరువాతైనా కేసీఆర్, జగన్ మోదీకి అండగా నిలుస్తారని కమలదళం భావిస్తోంది. అందుకే, కేంద్ర మంత్రులు వీలైనప్పుడల్లా తెలంగాణ రథసారథని పొగిడేస్తూ వస్తున్నారు. కానీ, ఇదే తెలంగాణ బీజేపీకి తలనొప్పిగా మారింది!

 

 

తమ పార్టీ నేతలే కేసీఆర్ పథకాల్ని మెచ్చుకుంటూ వుంటే టీ బీజేపీ నాయకులకి ఎలా విమర్శలు చేయాలో తెలియని గందరగోళం ఏర్పడుతోంద. అలాగని, తెలంగాణలో ప్రతిపక్షానికే పరిమితం అయిన కాంగ్రెస్ ని కూడా వారు ఏమంత టార్గెట్ చేయలేరు. అధికార పక్షాన్ని, ప్రతిపక్షాన్ని ఏమనకుండా జనంలోకి ఎలా వెళ్లాల్లో తెలంగాణ బీజీపీకి అర్థం కావటం లేదు. ఈ డైలామా కారణంగానే తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పట్ల అసతంతృప్తిగా వున్న నేతలు సైతం కాషాయ కండువా కప్పుకోవటం లేదు. అసలు ఏ మాత్రం దిశా, దశా లేకుండా సాగుతోంది టీ బీజేపి! అంతా అయోమయంగా వున్న వేళ తెలంగాణలో కాలుమోపిన అమిత్ షా ఏం చేయనున్నారు? పరిపూర్ణానంద స్వామిని నగర బహిష్కరణ చేసి హిందూత్వవాదుల వ్యతిరేకతకి కారణమైన కేసీఆర్ పై ముప్పేట దాడి చేయమని తన పార్టీ వారికి చెబుతారా? లేక ఎన్నికల ఫలితాల తరువాత మోదీ ప్రధాని అయ్యేందుకు కేసీఆర్ ఉపయోగపడతారని మెతక వైఖరి ప్రదర్శించమంటారా? ఇదే ఇప్పుడు తేలాల్సింది. అమిత్ షా ఇచ్చే ఆజ్ఞాలపైనే తెలంగాణ బీజేపీ యాక్షన్ ప్లాన్ ఆధారపడనుంది!