కేసీఆర్ ముస్లిమ్ రిజర్వేషన్స్ గొడవ... టీబీజేపికి బూస్ట్ గా మారిందా?


సెక్యులరిజానికి, ఓటు బ్యాంకు రాజకీయానికి చాలా సన్నటి గీత మాత్రమే అడ్డుగా వుంటుంది. అందుకే, మన నేతలు తమది సెక్యులరిజమ్ అంటూ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసేస్తుంటారు. ఇది జనాలకి తెలియదా అంటే తెలిసినా కూడా ఎప్పటికప్పుడూ చూసీ చూడనట్టు ఊరుకుంటూ వుంటారు. కాని, ఇప్పుడు చాలా చోట్ల బీజేపీకి ఈ ఓటు బ్యాంకు రాజకీయాలే కలిసొస్తున్నాయి. నిజంగా ముస్లిమ్ లు, క్రిస్టియన్ల బాగుకూ ఏమీ చేయని సో కాల్డ్ సెక్యులర్ పార్టీలు మాటలు మాత్రం చెబుతాయి. వాటినే ఆసరాగా చేసుకుని కాషాయదళం విమర్శలు గుప్పిస్తూ బలం పుంజుకుంటూ వుంటుంది. కేరళ నుంచి ఆసోమ్ దాకా అంతటా ఇదే పరిస్థితి!

 

ఆంధ్రాలో టీడీపీతో పొత్తు పెట్టుకుని అధికారంలో వున్న బీజేపి తెలంగాణలో మాత్రం ప్రతిపక్షానికే పరిమితం అయింది. ప్రత్యేక రాష్ట్రానికి మద్దతు పలికితే కూడా, పార్లమెంట్లో బేషరతుగా ఓటు వేస్తే కూడా... తెలంగాణలో కమలం లాభపడింది ఏమీ లేదు. క్రెడిట్ అంతా టీఆర్ఎస్ కి, తరువాత మిగిలిన శేషం కాంగ్రెస్ కి దక్కింది. కేవలం అయిదుగురు పంచ పాండవుల్లాంటి ఎమ్మెల్యేలకే పరిమితమైంది!

 

టీఆర్ఎస్ , కాంగ్రెస్ ల మధ్య పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయిన బీజేపికి తాజాగా కేసీఆర్ మంచి అస్త్రం అందిస్తున్నట్టు కనిపిస్తోంది! అదే... ముస్లిమ్ రిజర్వేషన్ల అంశం! 12శాతం రిజర్వేషన్ మత ప్రాతిపదికగా ఇవ్వటం మన దేశంలో వీలవుతుందా? కాదనేది న్యాయ నిపుణుల అభిప్రాయం. కోర్టు తీర్పులు కూడా అదే చెబుతున్నాయి. అయినా కూడా ఎన్నికల ముందు కేసీఆర్ కమిట్ అయ్యారు. ఇప్పుడు ఎలాగైనా అమలు చేస్తాం అంటూ పదే పదే చెప్పుకొస్తున్నారు. దీనిపై ఎదురుతిరిగి పోరాడే సౌలభ్యం కేవలం హిందూత్వ పార్టీగా ముద్రపడ్డ బీజేపికే వుంది. మిగతా పార్టీలన్నీ ముస్లిమ్ ల ముందు తాము చెడు కావద్దని నిశ్శబ్దంగా వుండిపోతున్నాయి.

 

ముస్లిమ్ రిజర్వేషన్ల అంశంలో బీజేపి సభ్యులు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుండటంతో అయిదుగురు ఎమ్మేల్యేల్ని సస్పెండ్ చేసేశారు స్పీకర్. ఇద బీజేపికి మరింత ఉత్సాహానిచ్చే పరిణామం. ముందు ముందు కూడా కమలం నేతల్ని గులాబీ నేతల్ని ఈ విషయంపై కార్నర్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అయితే, ఈ ఒక్క అంశం పట్టుకుని వచ్చే ఎన్నికల్లో బీజేపి అధికారంలోకి వచ్చేస్తుందని ఎవ్వరూ అనరు. కాని, బీజేపి ఎలాగైనా తెలంగాణలో అస్థిత్వం చాటాలని చూస్తోన్న తరుణంలో కేసీఆర్ తన మత రిజర్వేషన్ల హామీతో ఒక మంచి అవకాశం అయితే ఇచ్చినట్టే కనిపిస్తోంది. సెక్యులర్ నేతలుగా చెలామణి అయ్యే నాయకులు చట్టం ఒప్పుకోని మత రిజర్వేషన్ల లాంటి హామీలు ఇవ్వకపోతే మంచిది. లేదంటే, దీర్ఘ కాలంలో జనం ఇటు బీజేపి, అటు ఎంఐఎం లాంటి పార్టీల వైపు ఆకర్షితులయ్యే ప్రమాదం కూడా వుంది...