2014 ఎన్నికల లోపు తెలంగాణ సాధ్యమా?

 

 

 

ఇప్పటి పరిస్థితులు చూస్తోంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు 2014 ఎన్నికల లోపు సాకారం అయ్యేలా కనిపించడం లేదు. విభజన ముసాయిదా బిల్లును కేంద్ర హోంశాఖ గురువారం ప్రత్యేక విమానంలో రాష్ట్రానికి పంపించింది. బిల్లుపై శాసనసభలో అభిప్రాయ సేకరణకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గరిష్ఠంగా ఆరు వారాలు సమయమిచ్చారు.


'జనవరి 23వ తేదీలోపు' అసెంబ్లీలో అభిప్రాయ సేకరణ పూర్తి చేయాలని స్పష్టం చేసినట్లు తెలిసింది. వాటిని క్రోడీకరించి ఢిల్లీకి పంపించేందుకు మరో మూడు రోజులు అదనంగా గడువు ఇచ్చినట్లు సమాచారం. అంటే... జనవరి 26వ తేదీ వరకు సమయం ఉన్నట్లే. రాష్ట్రపతి ఇచ్చిన గడువు ముగిసేంత వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి కేంద్రానికి అధికారం లేదు.  దీనిని బట్టి చూస్తే శీతాకాల సమావేశాలు ముగిసే లోపు తెలంగాణ బిల్లు పార్లమెంట్ చేరడం కష్టంగా కన్పిస్తోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 20 ముగియనున్నాయి.



అయితే కేంద్రం కనుక పార్లమెంటు సమావేశాలు పొడిగించడమో,లేక మళ్లీ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడమో చేస్తే తప్ప తెలంగాణ బిల్లు ఆమోదం పొందడం కష్టం కావచ్చు. కేంద్రం , కాంగ్రెస్ హై కమాండ్ తెలంగాణ పై మరీ పట్టుదలతో ఉంటే తప్ప ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడమో, లేక సమావేశాలలను పొడిగించడమో చేయకపోవచ్చు. అసెంబ్లీ లో బిల్లుపై అభిప్రాయాలు తెలుసుకున్న తరువాత తెలంగాణ ముసాయిదా బిల్లు హోంమినిస్ట్రీరికి.. తిరిగి రాష్ట్రపతికి వెళ్లి , అక్కడ నుంచి పార్లమెంటుకు ఆమోదానికి వెళ్ళుతుంది.