కీలక బిల్లులు పాస్.. సభ వాయిదా.. కేసీఆర్ మార్క్ ! 

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అధికార టీఆర్ఎస్ మరోసారి వ్యూహాత్మకంగా వ్యవహరించింది. తమకు కావాల్సిన కీలక బిల్లులను ఆమోదించుకుని అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేసుకుంది. ఈనెల 7న ప్రారంభమైన అసెంబ్లీ వర్షకాల సమావేశాలు.. కేవలం ఎనిమిది రోజులకే ముగిశాయి. 

అసెంబ్లీని ఈనెల 28 వరకు నిర్వహించాలని మొదట నిర్ణయించారు. ప్రతిపక్షాలు కోరితే ఎన్ని రోజులైనా సభ జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమని బీఏసీ సమావేశంలో సీఎం కేసీఆర్ చెప్పారు. కాని ఎనిమిది రోజులు మాత్రమే సభ జరిపి నిరవధికంగా వాయిదా వేశారు. కరోనా వ్యాప్తి నేప‌థ్యంలో బీఏసీ క‌మిటీ సూచ‌న‌, అన్ని ప‌క్షాల స‌భ్యుల విజ్ఞ‌ప్తి మేర‌కు స‌భ‌ను నిర‌వ‌ధికంగా వాయిదా వేయాల్సి వ‌స్తుంద‌ని స్పీక‌ర్ పోచారం ప్ర‌క‌టించారు. అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌రైన ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌కు, పోలీసు, శాస‌న‌స‌భ సిబ్బందిలో కొంద‌రికి క‌రోనా సోకింద‌న్నారు. మొత్తం 12 బిల్లుల‌పై చ‌ర్చించి స‌భ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింద‌ని స్పీక‌ర్ పోచారం తెలిపారు.

 

అయితే విపక్షాలు మాత్రం ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నాయి. సభలో తమకు కావాల్సిన బిల్లులు పాస్ చేసుకున్న ప్రభుత్వం.. కరోనా సాకుతో సభను వాయిదా వేసిందని ఆరోపిస్తున్నాయి. ఈ సెషన్ లోనే అత్యంత కీలకమైన, సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కొత్త రెవిన్యూ చట్టాన్ని ప్రభుత్వం ఆమోదించుకుంది. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. కీలకమైన టీఎస్- బి పాస్, జీఎస్టీ  సవరణ బిల్లులు ఆమోదం లభించింది. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ  ఉభయ సభల్లో తీర్మానం చేశారు. తమకు కావాల్సిన బిల్లుకు ఆమోదం లభించగానే ప్రభుత్వం వ్యూహాత్మకంగా సభలను వాయిదా వేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. 

 

కరోనా భయంతోనే సభను వాయిదా వేయాల్సి వస్తే.. అసలు అసెంబ్లీ సమావేశాలే జరపాల్సి ఉండవద్దని చెబుతున్నారు. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి రెండు రోజుల ముందే మంత్రి హరీష్ రావుకు కరోనా సోకింది. ఆయనతో కాంటాక్టు ఉన్న కొందరు ఎమ్మెల్యేలు క్వారంటైన్ కు వెళ్లారు. ఇక సమావేశాల రెండో రోజే అసెంబ్లీ సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చింది. అసెంబ్లీలో పాసులు జారీ చేసిన ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చింది. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన ఉద్యోగి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా విధుల్లో ఉండటంతో ప్రజాప్రతినిధులను కరోనా భయం వెంటాడింది. అతని ద్వారా ఎంతమందికి వైరస్ సోకిందోమోనన్న ఆందోళన వ్యక్తమైంది. అసెంబ్లీ భద్రతా సిబ్బందికి కరోనా టెస్టులు చేయడం లేదనే విమర్శలు వచ్చాయి. అయినా అసెంబ్లీని కొనసాగించింది ప్రభుత్వం. 

 

కరోనా సోకిన మంత్రి హరీష్ రావు కోలుకుని అసెంబ్లీకి వచ్చారు. ప్రభుత్వం మాత్రం కరోనా కారణంతో సభను వాయిదా వేసింది. అసెంబ్లీ సిబ్బందికి కరోనా సోకినా సభ నిర్వహించిన ప్రభుత్వం.. అంతా సర్దుకున్నాకా అసెంబ్లీకి వాయిదా వేయడమేంటనే చర్చ ప్రజల్లోనూ జరుగుతోంది. గతంలోనూ చాలా సార్లు అసెంబ్లీ సమావేశాలపై సీఎం కేసీఆర్ మాట తప్పారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. విపక్షాలు కోరితే ఎన్ని రోజులైనా సభ జరుపుతామని చెప్పడం.. మధ్యలోనే వాయిదా వేసుకుని వెళ్లడం ఆయనకు  అలవాటేనని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. సభ జరిగితే ప్రభుత్వ వైఫల్యాలపై విపక్ష సభ్యులు ప్రశ్నిస్తారన్న భయంతోనే ప్రభుత్వం అసెంబ్లీని వాయిదా వేసిందని ప్రతిపక్ష సభ్యులు ఆరోపిస్తున్నారు. 

 

అసెంబ్లీ సమావేశాల్లో ఈసారి విపక్షాలు ప్రజాసమస్యలపై గట్టిగానే ప్రభుత్వాన్ని నిలదీసిందనే చర్చ జనాల్లో జరుగుతోంది. భట్టీ విక్రమార్క, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు మంత్రులతో వాగ్వాదాలకు దిగారు. ఇక ఎమ్మెల్యే సీతక్క ప్రజా సమస్యలను ప్రస్తావించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సభలో విపక్షాల వాయిస్ పెరిగితే తమకు ఇబ్బంది వస్తుందనే భయంతోనే ప్రభుత్వం అసెంబ్లీని కరోనా కారణంతో తొందరగా ముగించి ఉండవచ్చని రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది.