బీజేపిని, కాంగ్రెస్ ను ఏకం చేసిన టీఆర్ఎస్!

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఎవ్వరూ వుండరంటారు! కాని, అప్పుడప్పుడూ తాత్కాలిక మిత్రులు కూడా పుట్టుకొస్తుంటారు ! తెలంగాణ అసెంబ్లీలో అదే జరిగింది! బీజేపికి మద్దతుగా కాంగ్రెస్ వాకౌట్ చేసింది! యెస్ ... కరెక్టే కమలానికి అండగా హస్తం స్నేహ హస్తం చాచింది! ఈ పరిణామానికి కారణం మరెవరో కాదు... టీ అసెంబ్లీలో అధికార పక్షమైన టీఆర్ఎస్!

 

ఈ మధ్య చట్ట సభల్లో సస్పెన్షన్ టెక్నిక్ గా బాగా వర్కవుట్ అవుతోంది! తెలంగాణ అయినా , ఆంధ్రా అయినా, లేక మహారాష్ట్రా అయినా కూడా రూలింగ్ పార్టీకి చిర్రెత్తుకొస్తే సభ బయటకి గెంటేస్తున్నారు. తమలో తామే హాయిగా చట్ట సభని నడిపేసుకుంటున్నారు! ప్రస్తుతం నడుస్తున్న అసెంబ్లీ సెషన్స్ ప్రారంభంలోనే టీ టీడీపీ నేతలు రేవంత్, సండ్ర సస్పెన్షన్ కాటుకి గురయ్యారు. గవర్నర్ ప్రసంగం సమయంలో అడ్డుతగిలారని వారిపై ఆరోపణలు వచ్చాయి. దాంతో స్పీకర్ వార్ని ఈ సెషన్స్ మొత్తం నిషేధించేశారు! ఇక తాజాగా బీజేపి ఎమ్మెల్యేలకు కూడా బహిష్కరణ రుచి ఎలా వుంటుందో కేసీఆర్ సర్కార్ రుచి చూపించింది. మతపరమైన రిజర్వేషన్ల గురించి కమలం ఎమ్మెల్యేలు గొడవ చేయటంతో వారికి సస్పెన్షన్ సన్మానం చేసింది. 

 

బీజేపి ఎమ్మెల్యేలని బయటకి పంపించటంతో వారికి అనూహ్య కోణం నుంచీ మద్దతు లభించింది. ఆగర్భ శత్రువులైన కాంగ్రెస్ పార్టీ వారు కమలం నేతల్ని బహిష్కరించటం తప్పని గట్టిగా వాదించారు. జానా రెడ్డి తాము ఇలా సస్నెన్షన్ చేయటాన్ని ఖండిస్తున్నామని తేల్చి చెప్పారు. అంతే కాదు, కేసీఆర్ ధర్నా చౌక్ తొలగించటంతోనే బీజేపి సభ్యులు సభలో గోల చేయాల్సి వచ్చిందని కూడా అన్నారు. చివరగా, సస్పెండ్ అయిన సభ్యులకి మద్దతుగా తాము వాకౌట్ చేస్తున్నామని చెప్పి వెళ్లిపోయారు! 

 

తెలంగాణ అసెంబ్లీలో బద్ధ శత్రువులైన కాంగ్రెస్ , బీజేపిల్ని కూడా ఏకం చేశారు కేసీఆర్. అయితే, ఇదే తరహా సస్పెన్షన్ ఫార్ములా అమలవుతోంది ఆంధ్రా అసెంబ్లీలో కూడా! అక్కడ రోజా బహిష్కరణ తతంగం చాలా రోజులుగా నడుస్తూనే వుంది! అంతే కాదు, మహారాష్ట్రా అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేల్ని అక్కడి ఫడ్నవీస్ గవర్నమెంట్ స్పీకర్ సాయంతో రోజుల తరబడి సభ బయటకు నెట్టేసింది! ఇక ఆ మధ్య బల పరీక్ష సమయంలో తమిళనాడు అసెంబ్లీలో జరిగిన దారుణమైతే అందరికీ తెలిసిందే! స్టాలిన్ తో సహా బోలెడు మంది బట్టలే చినిగిపోయాయి! అప్పుడు కూడా చివరకు తమకు అడ్డుగా వున్న ఎమ్మేల్యేలు అందర్నీ అవతలకి పంపి పని కానిచ్చేశారు!

 

ప్రతిపక్ష సభ్యుల్ని బయటకి తోసేసి సభలు నడిపించటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. అదే సమయంలో ప్రతిపక్షాల నేతలు కూడా బాధ్యతగల ప్రజా ప్రతినిధులుగా హుందాగా వ్యవహరిస్తే స్పీకర్లు చిన్నప్పటి స్కూల్ టీచర్ల మాదిరిగా మారకుండా వుంటారు! మార్పు ఇద్దరి వైపు నుంచీ రావాలి... ఎందుకంటే, అధికార పక్షం, ప్రతిపక్షం అన్న హోదాలు శాశ్వతం కాదు. ఇవాళ్ల సస్పెండ్ చేసిన పార్టీ అయిదేళ్ల తరవాత సస్పెండ్ అవ్వాల్సి రావొచ్చు!