తెలంగాణ బీజేపీలో చిచ్చు... ఫొటోల వివాదంతో ఆగిపోయిన ప్రచారం

తెలంగాణ బీజేపీలో చిచ్చు రేగింది. రాష్ట్ర నేతలకు....జిల్లా నాయకులకు మధ్య వివాదం నడుస్తోంది. జాతీయ నాయకత్వం పిలుపు మేరకు విస్తారక్ యోజన కార్యక్రమం నిర్వహిస్తోన్న టీబీజేపీ.. మోడీ ప్రభుత్వ విజయాల గురించి ఇంటింటికి తిరిగి ప్రచారం చేపడుతోంది. దాదాపు 8వేల మంది కార్యకర్తలు గ్రామగ్రామానికీ వెళ్లి ఎన్డీఏ సర్కారు అమలు చేస్తున్న పథకాలు, పార్టీ సిద్దాంతాలతో పాటు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఉపదేశాలతో కరపత్రాలను ప్రతి ఇంటికి అతికిస్తున్నారు. అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల గురించి వివరిస్తూ...మరో కరపత్రాన్ని పంపిణీ చేస్తున్నారు. అయితే ఈ విస్తారక్ కార్యక్రమం పార్టీకి మంచి చేసిందో లేదో తెలియదు కానీ.. బీజేపీ నేతల మధ్య విభేదాలకు కారణమైంది.

 

విస్తారక్ కార్యక్రమంలో పంచే కరపత్రాలపై అగ్రనేతలైన దత్తాత్రేయ, మురళీధర్ రావు, లక్ష్మణ్, కిషన్ రెడ్డి ఫొటోలు మాత్రమే ముద్రించారు. దీనిపై జిల్లా జిల్లా నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. నియోజకవర్గాల్లో పంచే పాంప్లెట్లలో స్థానిక నేతల ఫొటోలు ప్రింట్ చేయకుండా జాతీయ, రాష్ట్ర నేతల ఫొటోలు ముద్రిస్తే ఏం ప్రయోజనమని నిలదీశారు. నియోజకవర్గానికి చెందిన నాయకుని ఫొటోను పెడితే అతనికి ప్రచారం పెరిగి... వచ్చే ఎన్నికల్లో ఓట్ షేర్ పెరిగే అవకాశం ఉందని, అది కూడా తెలియకుండా... కేవలం జాతీయ, రాష్ట్ర నేతల ఫొటోలు మాత్రమే ముద్రిస్తే ఏం లాభమని నిలదీశారు.

 

ఫొటోల విషయంపై నియోజకవర్గాల నేతలు జిల్లా నాయకుల్ని నేతల్ని ప్రశ్నిస్తుంటే ఏం సమాధానం చెప్పాలో తెలియక బిక్కమొహం వేస్తున్నారు రాష్ట్ర నేతలు. అంతేకాదు...తమ ఫొటోలు లేకుండా విస్తారక్ కార్యక్రమాన్ని నిర్వహించడం కష్టమని స్థానిక నేతలు తేల్చి చెప్పినట్లు తెలిసింది.