బరాత్‌లు ఇక బందేనట..?

 

మేళ తాళాలతో.. తప్పిట్లతో.. బాణాసంచా పేలుళ్లతో గుర్రం మీద కూర్చొన్న పెళ్లికుమారుడిని పెళ్లి పందిరి వద్దకు అట్టహాసంగా తీసుకువచ్చే వేడుకే బరాత్‌. బంధువులు, సన్నిహితులు, తెలిసినోళ్లు డ్యాన్సులు చేస్తూ ఉంటే.. దానిని చూస్తోన్న వారు కూడా పూనకంతో ఊగిపోతూ కాలు కదిపే సంబరంలో ఉన్న మజానే వేరు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ బరాత్‌లకు పెట్టింది పేరు. మొదట్లో ముస్లింలు మాత్రమే జరుపుకునే ఈ సంబరాన్ని రాను రాను అన్ని మతాలు, కులాలు తమ సంస్కృతిలో భాగంగా చేసుకున్నాయి. ఏదీ ఏమైనా అసలైన బరాత్‌లు చూడాలి అంటే ముస్లింల పెళ్లిళ్లలోనే చూడాలి. అయితే ఇక మీదట హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ముస్లింల పెళ్లిళ్లలో బరాత్‌లు కనిపించవు. తెల్లవారిందాకా బరాత్‌లు సాగడంతో పాటు అర్ధరాత్రి వేళ మేలతాళాలు మోగిస్తూ.. బాణాసంచా కాలుస్తూ.. నృత్యాలు చేస్తూ నింపాదిగా పెళ్లి కొడుకు రోడ్ల మీద వెళుతూ ఉంటే.. పబ్లిక్ డిస్ట్రబ్ అవుతుండటంతో పాటు ఈ మధ్యకాలంలో కొన్ని అనివార్య సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఒక బరాత్‌లో కాల్పులు.. మరో బరాత్‌లో తల్వార్ ఆట కారణంగా ఒకరు మరణించగా పలువురు గాయపడ్డారు. దీంతో వీటిని కట్టడి చేసేందుకు తెలంగాణ వక్ఫ్‌బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ముస్లింల వివాహా వేడుకల్లో బరాత్‌లు బ్యాన్ చేయడంతో పాటు మరికొన్ని ఆంక్షలు విధించే దిశగా కసరత్తులు చేస్తోంది. నిఖా ప్రక్రియ రాత్రి తొమ్మిది గంటలలోపు పూర్తి చేయాలని.. రాత్రి 12 గంటలు దాటితే ఫంక్షన్ హాల్స్ మూసే విధంగా చర్యలు చేపట్టనుంది.

 

అలాగే పెళ్లి విందులో గొప్పలకు పోకుండా పరిమితితో సాగే విధంగా కట్టడి చేయాలని వక్ఫ్ బోర్డ్ భావిస్తోంది. ఈ ప్రణాళికలో భాగంగా 23వ తేదిన పోలీసులు, ఖాజీలు, మత పెద్దలతో తెలంగాణ వక్ఫ్‌బోర్డు పాలక మండలి సమావేశం కానుంది. అయితే ఎన్నో ఏళ్లుగా వస్తోన్న ఆచారాన్ని నిషేధిస్తే ఒప్పుకునేది లేదని కొందరు .. సాంప్రదాయం అనేది మనుషుల్లో ఆనందాన్ని నింపాలి కానీ.. మనుషుల ప్రాణాలు తీయడం.. సమాజాన్ని ఆటంకపరచరాదని మరికొందరు వాదిస్తున్నారు. మరి ఇలాంటి పరిణామాల మధ్య వక్ఫ్‌బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాలంటే 23 వరకు వేచి చూడాల్సిందే.