నత్త నడక నిర్మాణం... ప్రతి పండగకు కొన్ని ఇస్తామనేలా వ్యవహరిస్తున్న ప్రభుత్వం

గ్రేటర్ సిటీలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు నత్త నడకన సాగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం గ్రేటర్ పరిధిలో లక్ష ఇళ్లు నిర్మిస్తామని చెప్పినా అనుకున్న సమయానికి పూర్తి కావడం లేదు. కొన్ని చోట్ల మాత్రం కోర్టు కేసుల వల్ల నిర్మాణమే జరగలేదు. హైదరాబాదులోని 109 ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తుండగా వీటిలో ప్రస్తుతం నిర్మాణం పూర్తి చేసుకొని లబ్ధిదారుల అందినవి కేవలం 30% ఇళ్లు మాత్రమే. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు చాలా వరకు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. సింగం చెరువు తండాలో 176, ఐడీహెచ్ లో 136, చిత్తారమ్మ బస్తీలో 101 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యి లబ్ధిదారులకు అందాయి. ఇక కొల్లూరులో 15,660 మెగా డబుల్ బెడ్ రూంల ఇళ్ల నిర్మాణం వేగంగా సాగుతోంది. ఒకే చోట 15,660 డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం తుది దశకు చేరుకుంది.117 హౌజింగ్ బ్లాకుల్లో S9,S+10,S+11 అంతస్తుల్లో నిర్మిస్తున్నారు. గ్రేటర్ పరిధిలో మరి కొన్ని.. రెవెన్యూ కోర్టు కేసులతో 7 ప్రాంతాల్లో 1,918  ఇళ్ళ నిర్మాణాలు ఆగిపోయాయి.ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వాటిలో 9 వేల ఇళ్లు పూర్తయినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ఫిబ్రవరిలో వీటిని అర్హులకి అందిస్తామన్నారు.

జూన్ వరకు 50 వేల ఇళ్లను లబ్ధిదారులకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.కార్వాన్ నియోజక వర్గంలోని బోజగుట్టలో 1800 వందలు కుటుంబాలకు డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. శంకుస్థాపన చేసిన సమయంలో వాటిని పద్నాలుగు నెలల్లో నిర్మించి ఇస్తామని అప్పటి వరకు పక్కనే ఉన్న ఖాళీ స్థలాల్లో గుడిసెలు ఏర్పాటు చేసుకోవచ్చని రెండేళ్ల కిందట జీహెచ్ ఎంసీ అధికారులు తెలిపారు. అయితే కొంత మంది అక్కడే గుడిసెలు వేసుకోగా మరి కొందరు వేరే ప్రాంతాల్లో అద్దెకుంటున్నారు. శంకుస్థాపన చేసి రెండేళ్లవుతున్నా పనుల్లో మాత్రం పురోగతి లేకపోవడం పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్ల కిందట విజయ దశమి సందర్భంగా 109 ప్రాంతాల్లో శంకుస్థాపనల చేస్తే వాటిలో చాలా వరకు నిర్మాణా లు నిదానంగా సాగుతున్నాయి. అవి ఎప్పుడు పూర్తవుతాయో లబ్ధిదారులకు ఎప్పుడు అందుతాయో తెలియక గందరగోళంలో ఉన్నారు.