కుర్రాళ్లు దూకుడుగా ఉండటం మంచిదేనట!

‘ఈ కాలం కుర్రాళ్లున్నారు చూశారూ! వాళ్లకి అసలు భయమే లేదనుకోండి..’ అని తెగ చిరాకు పడిపోతుంటారు పెద్దలు. ఎన్ని శతాబ్దాలు గడిచినా ఈ మాట ఇలాగే ఉంటుంది. ఎన్ని తరాలు దాటినా, కుర్రాళ్లు దూకుడుగానే ఉంటారు. ఇంతకీ కుర్రకారు ఎందుకని అలా దూకుడుగా ఉంటారు? దాని వల్ల ఉపయోగం ఏమన్నా ఉందా? అన్న ప్రశ్నలకి ఇప్పటికి జవాబు దొరికిందట.


కుర్రకారు దూకుడి గురించి ఇప్పటిదాకా చాలా పరిశోధనలే జరిగాయి. వీటిలో చాలా పరిశోధనలు రకరకాల విశ్లేషణలు చేశాయి. యువకులలో ‘టెస్టాస్టెరాన్‌’ వంటి హార్మోనుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని కొందరు తేల్చారు. మెదడులోని ‘prefrontal cortex’లో లోపం వల్ల దూకుడు పెరుగుతుందని మరికొందరు ఊహించారు. కానీ ఇవేవీ నిజం కాదని అమెరికా పరిశోధనలు రుజువుచేస్తున్నారు.


మనం ఏదన్నా సాహసం చేసేటప్పుడు ఉద్వేగానికి లోనవుతాం. ఆ సాహసం చేశాక ఒక తెలియని తృప్తి లబిస్తుంది. ఈ తృప్తి కోసమే కుర్రకారు సాహసాలు చేసేందుకు సిద్ధంగా ఉంటారని తాజా పరిశోధనలో బయటపడింది. ఒకోసారి ఇలాంటి తృప్తిని కోరుకునే తొందరపాటులో మద్యంలాంటి అలవాట్లు చేసుకోవడం, లేనిపోని గొడవలకు వెళ్లడం, బళ్లు వేగంగా నడపడం... లాంటి ప్రవర్తన కనిపిస్తుంది. అలాంటి సందర్భాలు పక్కన పెడితే, దూకుడు వల్ల కుర్రకారుకి జీవితపాఠాలు తెలుస్తాయంటున్నారు.


కుర్రవాళ్లు అప్పుడప్పుడే జీవితంలోకి అడుగుపెడుతూ ఉంటారు. లోకం అంతా వారికి కొత్తగా కనిపిస్తుంది. ఆ ప్రపంచాన్ని నిదానంగా ఆకళింపు చేసుకుందాం అనుకుంటే విలువైన జీవితం కాస్తా గడిచిపోతుంది. అందుకోసం వారి ముందు ఉన్న మార్గం ఒక్కటే! Trial and error method ద్వారా ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకోవడమే! జీవితాన్ని శోధించి చూడటమే! అందుకే వారిలో దూకుడు పెంచేలా ‘డోపమైన్’ అనే రసాయనం ఎక్కువగా ఉత్పత్తి అవుతుందట. వారు ఎంత సాహసం చేస్తే అంత తృప్తి లభించేలా ఈ డోపమైన చూసుకుటుంది.


ఇలా కుర్రతనపు చేష్టలతో మనం రకరకాల అనుభవాలను పొంది చూస్తాం. వాటి ఫలితాల ఆధారంగా మనదైన వ్యక్తిత్వాన్ని రూపొందించుకుంటాం. మున్ముందు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను దాటేందుకు ఆ వ్యక్తిత్వమే ఉపయోగపడుతుంది. ఎలాంటి ఉద్యోగాన్ని ఎన్నుకోవాలి? సమయాన్ని ఎలా గడపాలి? డబ్బు ఎలా ఖర్చుచేయాలి? లాంటి కీలకమైన ప్రశ్నలకు ‘కుర్రతనపు’ అనుభవాలే ఉపయోగపడతాయట.


దూకుడుగా ఉండటం వల్ల కుర్రకారుకి మేలే అని తేలిపోయింది. కానీ దీనివల్ల నష్టాలు కూడా ఉంటాయి కదా! లేనిపోని గొడవలూ వస్తాయి కదా! అందుకే ఇంట్లో కుర్రకారు ఉన్న తల్లిదండ్రులు తెగ మధనపడిపోవడం సహజం. కానీ అందరు కుర్రకారూ ఇలా చెడుదారులలోకి వెళ్లాలని కానీ, అదే దారిలో ఉండిపోవాలని కానీ లేదట. తమని తాము అదుపు చేసుకోలేని మనస్తత్వం ఉన్నవారే ఇలా ప్రవర్తిస్తారట. అలాంటివారి నడవడిని చిన్నప్పుడే గ్రహించవచ్చని చెబుతున్నారు. అంటే సమస్య కుర్రతనంలో దూకుడుగా ఉండేవారితో కాదు, చిన్నప్పుడే దూకుడుగా ఉండేవారితో అన్నమాట!

 

- నిర్జర.