రూపాయి టీచర్.. 

బతుకునిచ్చేది అమ్మానాన్న. బతుకు నేర్పేది బడి టీచర్. అందుకే గురు బహ్మ.. గురు విష్ణు.. గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరభాహ్మ తస్మైశ్రీ గురవేనమ  అన్నారు. జీతాలు తీసుకుని పాఠాలు చెప్పే టీచర్లు ఉంటారు. అదే జీతాలు తీసుకుని పాఠాలు చెప్పని టీచర్లు కూడా ఉంటారు. కానీ తనకు వచ్చిన జీతంలో 30 శాతం విద్యార్థులు భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టే టీచర్ ని ఎక్కడైనా చూశారా.. చూడకపోతే ఆ టీచర్ ని పరిచయం చేస్తాను పదండి.. 

పేరు పద్మావతి. ఓ ప్రభుత్వ టీచర్. ఆందరూ ప్రేమగా రూపాయి టీచర్ అంటారు. అవనిగడ్డ మండలం గుడివాకవారి పాలెం పాఠశాలలో విధుల్లోకి వెళ్ళింది పద్మావతి. ఆ పాఠశాలలో ఆరుగురు విద్యార్థులు మాత్రమే ఉన్నారు.. ఎలాగైన ఆ పరిస్థితిని మార్చాలని. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాలనుకుని ఓ మంచి ఆలోచనకు శ్రీకారం చుట్టారు. పిల్లలను బడిలో చేర్పిస్తే వారి పేరుమీద డబ్బులు జమ చేస్తానని తల్లిదండ్రులకు భరోసా కల్పించారు. పిల్లల పేరు మీద రికరింగ్‌ డిపాజిట్‌ (ఆర్డీ) అకౌంట్‌ తెరిచి, ప్రతి విద్యార్థి పేరుమీద రోజుకు రూపాయి చొప్పున.. నెలకు రూ. 30 జమచేయాలని భావించారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసి తమ పిల్లలను పాఠశాలలో చేర్పించాలని కోరారు. ఆ టీచర్ మీద నమ్మకంతో అమ్మానాన్నలు తమ పిల్లలను బడిలో చేర్పించారు. అలా ఆరుగురు కాస్తా 45 మంది అయ్యారు.  
  
పద్మావతి 30 శాతం జీతాన్ని విద్యార్థుల భవిష్యత్తు కోసమే ఖర్చు చేస్తున్నారు. పొదుపు ఖాతాల్లో డబ్బులు జమచేయడమే కాకుండా పిల్లలకు అవసరమైనప్పుడు పుస్తకాలు, పెన్నులు అందజేస్తున్నారు. అలా విద్యార్థులకు విద్యతోపాటు, పొదుపుపై పాఠాలు చెబుతూ.. వారి ఉన్నత భవిష్యత్తుకు బంగారు బాట వేస్తున్నారు. ఆమె ఏ పాఠశాలకు వెళ్లినా పొదుపు ఖాతాల విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఆమె కృషిని విద్యార్థుల తల్లిదండ్రులు, తోటి ఉపాధ్యాయులు కొనియాడుతున్నారు. పేదలకు వీలైనంత సేవ చేయడమే లక్ష్యమంటున్న పద్మావతి, ఉద్యోగ విరమణ తర్వాత వృద్ధులకు సేవ చేస్తానంటున్నారు. కృష్ణా జిల్లాలోఅవనిగడ్డ మండలం బందలాయి చెరువు ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు.