ఆశించినదానికంటే అధిక మైలేజ్... టీడీపీ కేడర్‌లో కొత్త ఉత్సాహం

టీడీపీ-వైసీపీ పోటాపోటీగా తలపెట్టిన ఛలో ఆత్మకూరుపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. అర్ధరాత్రి నుంచే ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు, నిర్బంధాలతో ఇరుపార్టీల నేతలు, కార్యకర్తలను అడ్డుకున్నారు. టీడీపీ ముఖ్యనేతలను హౌస్ అరెస్ట్‌చేసి, ఇళ్లల్లో నుంచి బయటికి రాకుండా, నిర్బంధించారు. జిల్లాల నుంచి టీడీపీ శ్రేణులు... రాజధానికి రాకుండా నియంత్రించారు. టీడీపీ నేతలు, కేడర్‌నే కాకుండా, అటు వైసీపీ శ్రేణులను  కూడా ఆత్మకూరు వైపు రాకుండా, ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. గుంటూరు సహా సమస్యాత్మక ప్రాంతాల్లో ఆంక్షలతోపాటు పెద్దఎత్తున బలగాలను మోహరించి, కవాతు నిర్వహించడంతో పల్నాడు అంతటా కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించింది.

టీడీపీ అధినేత చంద్రబాబును సైతం హౌస్ అరెస్ట్ చేశారు. బాబు, లోకేష్ ను‌... ఇంటి నుంచి బయటికి రాకుండా ఆంక్షలు విధించారు. అయితే, చంద్రబాబు కలిసేందుకు టీడీపీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు పెద్దఎత్తున రావడంతో ఉండవల్లి పరిసరాల్లో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తెలుగుదేశం లీడర్లను పోలీసులు అడ్డుకోవడంతో... అచ్చెన్నాయుడు, నన్నపనేని తదితరులు వాగ్వాదానికి దిగారు. మరోవైపు, పోలీసుల ఆంక్షలకు నిరసనగా తన ఇంట్లోనే చంద్రబాబు 12గంటల పాటు దీక్ష చేపట్టారు. అయితే, ప్రశాంతంగా ఉన్న పల్నాడులో అలజడి సృష్టించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వైసీపీ ఎదురుదాడికి దిగింది.

ఏదిఏమైనా ఎన్నికల్లో ఘోర పరాజయంతో తీవ్ర నిస్తేజంలో కూరుకుపోయిన తెలుగుదేశం కేడర్‌లో ఛలో ఆత్మకూరు... కొత్త ఉత్సాహాన్ని నింపిందనే మాట వినిపిస్తోంది. అయితే, టీడీపీ ఛలో ఆత్మకూరును నియంత్రించడంలో జగన్ ప్రభుత్వం విజయవంతమైనప్పటికీ, పార్టీపరంగా మాత్రం అవసరానికి మించి స్పందించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైసీపీ రియాక్షన్‌ తో టీడీపీ ఆశించినదానికంటే అధిక మైలేజ్ పొందిందనే మాట వినిపిస్తోంది.