జగన్ యూటర్న్.. టీడీపీకి భలే ఆయుధం దొరికిందిగా!!

 

పాదయాత్ర సమయంలో వైఎస్ జగన్ ఇచ్చిన హామీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్ ఇవ్వడం కూడా ఉంది. పాదయాత్రలో జగన్ ఈ పెన్షన్ గురించి చెప్పారు. చేనేతలు, ఇతర వృత్తుల్లో ఉండే బలహీనవర్గాలకు చెందిన వారు కష్టం చేసి.. 45 ఏళ్లకే సర్వశక్తులు కోల్పోతున్నారని.. వారి కుటుంబాలకు అండగా ఉండేందుకు 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని ప్రకటించారు. కానీ.. ఎన్నికల మేనిఫెస్టోలో మాత్రం దీని గురించి రాయలేదు. 

అయితే తాజాగా అసెంబ్లీలో టీడీపీ ఈ హామీ గురించి ప్రస్తావించింది. మంగళవారం అసెంబ్లీ ప్రారంభమవగానే.. 45 ఏళ్లకే పెన్షన్ అంశాన్ని హైలెట్ చేసింది. 45 ఏళ్లకే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు ఇస్తామన్న పెన్షన్ ను ఇచ్చి మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. అయితే జగన్ మరియు వైసీపీ నేతలు మాత్రం మేనిఫెస్టోలో ఆ హామీ లేదన్నట్లుగా మాట్లాడారు. మేనిఫెస్టోలో ఉన్నవన్నీ అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. టీడీపీ నేతలు మాత్రం.. జగన్ హామీని అమలు చేయాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలపై వేటు పడింది. ఈ అంశాన్ని బలంగా వినిపించిన నిమ్మల రామానాయుడు, బుచ్చయ్య చౌదరి, అచ్చెన్నాయుడులపై.. స్పీకర్ చైర్ లో కూర్చున్న కోన రఘుపతి.. సస్పెన్షన్ వేటు వేసి బయటకు పంపించేశారు. దీంతో వైసీపీ సర్కార్ టీడీపీ చేతికి ఆయుధం ఇచ్చినట్లు అయింది. జగన్ హామీ విషయంలో మాట తప్పారంటూ టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఏపీ అసెంబ్లీ నుంచి తమను అన్యాయంగా సస్పెండ్ చేసినా, ప్రజా సమస్యలపై తమ పోరాటం ఆగదని అచ్చెన్నాయుడు అన్నారు. ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే సస్పెండ్‌ చేశారని విమర్శించారు. హామీలు విస్మరిస్తున్నారని సభలో ప్రశ్నిస్తే సస్పెండ్‌ చేస్తారా?అని ప్రశ్నించారు. 45 ఏళ్లకే పింఛన్‌ ఇస్తానని పాదయాత్ర సమయంలో జగన్‌ హామీ ఇచ్చారని, దానిని విస్మరిస్తున్నారని చెబితే సస్పెండ్‌ చేస్తారా?అని దుయ్యబట్టారు. పెన్షన్లపై ప్రశ్నించడమే తన తప్పయిందని, దీనిపై మాట తప్పను, మడమ తిప్పను అని పదేపదే చెప్పే జగన్ ఏం సమాధానం చెబుతారని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.

ఈ విషయంపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ కూడా ట్విట్టర్ వేదికగా జగన్ మీద విమర్శలు గుప్పించారు. 46 ఏళ్లకి వైఎస్ జగన్ గారికి ఉద్యోగం వచ్చింది.. 45 ఏళ్ల పెన్షన్ రత్నం మాయమయ్యింది అని ఎద్దేవా చేసారు. పాదయాత్రలో గుర్తొచ్చిన ప్రజల కాళ్ల నొప్పులు మీరు కుర్చీ ఎక్కగానే మర్చిపోయారా? అని ప్రశ్నించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్ అన్న మీరు ఇప్పుడు పెనం మీద దోశ తిప్పినంత ఈజీగా మాట మార్చి వారిని మోసం చేసారని లోకేష్ విమర్శించారు. టీడీపీ నేతలనే కాదు నెటిజన్లు కూడా 45 ఏళ్ళ పెన్షన్ పై జగన్ యూటర్న్ అంటూ సెటైర్లు వేస్తున్నారు.

మరోవైపు.. టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడంతో.. టీడీపీకి చెందిన మిగతా ఎమ్మెల్యేలు కూడా సభ నుండి వాకౌట్ చేసారు. మొత్తానికి 45 ఏళ్ల పెన్షన్ హామీతో టీడీపీ జగన్ ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది. మరి జగన్ ఈ హామీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మేనిఫెస్టోలో లేదని లైట్ తీసుకుంటారో, లేక మాట ఇచ్చాను కాబట్టి మాట తప్పకుండా అమలు చేస్తాను అంటారో చూడాలి.