అస్త్రం సంధించిన టీడీపీ..

రాష్ట్ర విభజన హామీల సాధనే లక్ష్యంగా కేంద్రంపై పోరాటాన్ని తీవ్రతరం చేసింది తెదేపా.ఇప్పటికే ఆ పార్టీ ఎంపీలు పలు రాష్ట్రాల్లో పర్యటించి ఆయా పార్టీల నేతలతో భేటీ అయి తమకు మద్దతుగా నిలవాలని కోరుతూ చంద్రబాబు రాసిన లేఖను వారికి అందజేసిన విషయం తెలిసిందే. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో తెదేపా మళ్లీ కేంద్రంపై అవిశ్వాస అస్త్రాన్ని సంధించింది.

 

 

తెదేపా ఎంపీ కేశినేని నాని కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు లేఖ రాశారు. రేపు జరిగే సభా కార్యకలాపాల జాబితాలో ఈ అవిశ్వాస తీర్మానాన్ని చేర్చాలని కోరారు.గతంలో జరిగిన పార్లమెంట్‌ సమావేశాల్లో తెదేపా, వైకాపా సభ్యులు పోటాపోటీగా పలుమార్లు అవిశ్వాస తీర్మానాలు ఇచ్చినప్పటికీ సభ ఆర్డర్‌లో లేదంటూ సభాపతి సుమిత్రా మహాజన్‌ చెప్పడం,వాయిదాల పరంపర కొనసాగడంతో సభా కార్యకలాపాలు స్తంభించిన విషయం తెలిసిందే.తాజాగా తెదేపా ఇచ్చిన అవిశ్వాస తీర్మానంతో ఈ వర్షాకాల సమావేశాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనే దానిపై ఆసక్తి నెలకొంది.