అధికార పక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన టీడీపీ...

ఏపీ శాసన మండలిలో టీడీపీ సభ్యుల వాదనే నెగ్గింది. రూల్ 71 పై చర్చకు చైర్మన్ షరీఫ్ అనుమతించారు.అంతకుముందు గందరగోళ పరిస్థితుల నడుమ ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీయే ఉపసంహరణ బిల్లులను మండలిలో ప్రవేశపెట్టింది. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి పరిపాలనా వికేంద్రీకరణ బిల్లును మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ సీఆర్డీయే ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టారు. మంత్రులు ప్రవేశ పెట్టిన బిల్లులను పరిగణలోకి తీసుకుంటున్నట్లు చైర్మన్ ప్రకటించారు. చైర్మన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టిడిపి సభ్యులు పోడియం ఎదుట ఆందోళనకు దిగారు. రూల్ 71 పై చర్చకు నోటీసిచ్చిన బిల్లులను పరిగణలోకి తీసుకోవడం పై వారు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం చైర్మన్ స్పందిస్తూ రూల్ 71 పై చర్చ ప్రారంభించాలని సూచించారు. టిడిపి సభ్యుడు రాజేంద్ర ప్రసాద్ చర్చను ప్రారంభించారు.

ఏపీ శాసన మండలిలో రూల్ 71 కింద వైసిపి ప్రభుత్వాని టిడిపి ఇరుకున పెట్టింది. వికేంద్రీకరణ బిల్లునూ మండలిలో ఆమోదించాలని భావించిన వైసిపికి షాకిచ్చింది. రూల్ 71 ను తెరపైకి తీసుకు రావడంతో అధికార పక్షం ఆత్మరక్షణలో పడింది. రూల్ 71 అంటే ఏంటి అనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఓ ప్రభుత్వ పాలసీని రూల్ 71 కింద వ్యతిరేకించే హక్కు విపక్షానికి వుంది. రూల్ 71 కింద మంత్రిత్వ శాఖ పాలసీని వ్యతిరేకిస్తూ విపక్షం తీర్మానమివ్వవచ్చు, ఈ తీర్మానానికి 20 మంది సభ్యుల మద్దతు ఉంటే శాసన మండలి చైర్మన్ అనుమతితో సభలో దాని పై చర్చ జరగాల్సి ఉంటుంది. సెక్రటరీ ద్వారా రూల్ 71 కింద తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. ఈ తీర్మానం ఆర్డర్ లో ఉంటే దానిని చైర్మన్ చదివి వినిపిస్తారు. దీనికి 20 మంది సభ్యుల మద్దతు ఉంటే దానిని అదే రోజు లేదా సభ నిరవధిక వాయిదా పడేలోపు దానిపై చర్చించాల్సి ఉంటుంది. కానీ 20 మంది సభ్యుల కంటే తక్కువ మంది మద్దతు పలికితే దానిని తోసిపుచ్చి అధికారం చైర్మన్ కుంటుంది. 

ప్రస్తుతం టిడిపి కూడా ఇదే రూల్ 71 కింద తీర్మానమిచ్చింది, ప్రభుత్వ పాలసీ అయినా వికేంద్రీకరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఈ తీర్మానం ఇచ్చింది. దీంతో రూల్ 71 పై చర్చించక తప్పని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు శాసన మండలి ప్రసారాలను నిలిపి వేయడం పై టిడిపి అభ్యంతరం తెలిపింది. మండలి చైర్మన్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లారు యనమల రామకృష్ణుడు. తన ఆదేశాలు లేకుండా ప్రసారాలు నిలిపివేయడం పై చైర్మన్ షరీఫ్ విస్తుపోయినట్లు తెలుస్తుంది. తక్షణమే ప్రసారాలు పునరుద్ధరించాలని చైర్మన్ రూలింగ్ ఇచ్చినట్లు సమాచారం. కాగా, బిల్లులు పాస్ అవుతాయా లేదా అనే అంశం పై ఉత్కంఠ కొనసాగుతోంది. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపే ఆలోచనలో టిడిపి ఉంది. బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపితే జాప్యం జరిగే అవకాశముంది.సెలెక్ట్ కమిటీలో నిర్ణయానికి గరిష్ఠంగా మూడు నెలలు సమయం పట్టే అవకాశం ఉంది. మొత్తం మీద టీడీపీ చర్యలతో అధికార పక్షానికి గట్టి దెబ్బ ఎదురైయ్యింది.