ఆ మూడు నియోజకవర్గాలపై టీడీపీ ప్రత్యేక దృష్టి

 

ఏపీలో ఎన్నికలకు 8 నెలల సమయం ఉన్నప్పటికీ అధికార పార్టీ టీడీపీ ఇప్పటికే అభ్యర్థుల అన్వేషణలో నిమగ్నమైంది.. నియోజకవర్గాల్లో అంతర్గత సర్వేలను నిర్వహించి, గెలుపు గుర్రాలను గుర్తించే పనిలో పడింది.. పార్టీ క్రియాశీల కార్యకర్తల నుంచి వివరాలను రాబడుతోంది.. అధిష్ఠానం నియమించిన దూతలు ఇప్పుడు నియోజకవర్గాల్లో రహస్యంగా కేడర్ ను కలుస్తున్నారు.. కొందరు ఆశావహుల పేర్లను ప్రస్తావిస్తున్నారు.. వారిలో ఎవరైతే బాగుందన్న సమాచారాన్ని రాబడుతున్నారు.. గెలుపు ఎవరికి దక్కుతుంది?.. ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలనుకుంటున్నారని భావిస్తున్నారు?.. లాంటి ప్రశ్నలను పార్టీ కేడర్ వద్ద అధిష్ఠాన దూతలు సంధిస్తున్నారు.. ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో కీలక నియోజకవర్గాల్లో పార్టీ కేడర్ ను సంప్రదింపులు జరిపారు.. ముఖ్యమైన కార్యకర్తలు, నాయకులను కలుసుకున్నారు.. తాడేపల్లిగూడెం, నరసాపురం, ఉంగుటూరు నియోజకవర్గాలపై అధిష్ఠానం ప్రత్యేక దృష్టి పెట్టినట్టు కనబడుతోంది.. జనరల్ స్థానాల్లో ఎవరికి టిక్కెట్ ఇస్తే రాబోయే ఎన్నికల్లో పార్టీ పరిస్థితి బాగుందన్న విషయంపై దృష్టి సారించింది..పార్టీ శ్రేణుల మనోగతాన్ని వెలికితీసే ప్రయత్నం చేస్తోంది.

 

 


తాడేపల్లిగూడెం నియోజకవర్గం అధిష్ఠానానికి ఇప్పుడు క్రియాశీలకంగా మారింది.. గత ఎన్నికల్లో అప్పటి మిత్రపక్షమైన బీజేపీకి తాడేపల్లిగూడెం స్థానాన్ని కేటాయించారు.. అప్పట్లో స్థానిక టీడీపీ నాయకుల మధ్య వైరుధ్యాలు కూడా ఈ స్థానాన్ని బీజేపీకి దక్కేలా చేసాయి.. టీడీపీ మద్దతుతో బీజేపీ గెలుపొందినప్పటికీ స్థానికంగా రెండు పార్టీల మధ్య దూరం కొనసాగుతూ వచ్చింది.. పార్టీ శ్రేణులు రెండు పార్టీల మధ్య నలిగిపోయారు.. ప్రస్తుతం టీడీపీ,బీజేపీ మధ్య మిత్ర ధర్మం చెడిపోవడంతో రాబోయే ఎన్నికల్లో ఈ స్తానం నుండి టీడీపీ పోటీ చేయనుంది.. అందుకు తగ్గట్టే ఆశావహులు కూడా సిద్ధంగా ఉన్నారు.. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరికి టిక్కెట్ ఇస్తే విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయి?.. ఎవరి అభ్యర్థిత్వాన్నికోరుకుంటున్నారంటూ అధిష్ఠానం పంపిన దూతలు పార్టీ కేడర్ వద్ద ప్రస్తావిస్తున్నారు.. తాడేపల్లిగూడెంలో ముగ్గురు పేర్లతో ఇటువంటి సర్వే సాగింది.. అందులో జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు, నియోజకవర్గ సమన్వయ కర్త ఈలి నాని, మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాసులు ఉన్నారు.. కొద్దిరోజుల క్రితమే సర్వే బృందం నియోజకవర్గంలో పర్యటించింది.

 


అదేవిధంగా ఉంగుటూరులో కూడా అధిష్ఠానం సర్వే నిర్వహించింది.. రాజకీయాల్లో అనాదిగా ఉంగుటూరుకి ఒక సెంటిమెంట్ ఉంది.. ఎన్నికల్లో ఆ నియోజకవర్గం ఎవరిపక్షాన ఉంటే రాష్ట్రంలో వారిదే గెలుపన్న సెంటిమెంట్ అందరిలోనూ పాతుకుపోయింది.. దీంతో టీడీపీ అధిష్ఠానం ఉంగుటూరుపైన ఆసక్తి కనబరుస్తోంది.. అందులో భాగంగా సర్వే నిర్వహించి వివరాలను రాబట్టింది.. ఉంగుటూరు పరిధిలో నలుగురు పేర్లతో సర్వే సాగింది.. వారిలో ప్రస్తుత ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, ఎంపీ మాగంటి బాబులు ఉన్నారు.. అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు పేరుతో తాడేపల్లిగూడెంతో పాటు, ఉంగుటూరులోనూ సర్వే సాగింది.. మరోవైపు సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకొని ఎంపీ తోట సీతారామలక్ష్మి తనయుడు తోట జగదీష్ పేరును కూడా ఉంగుటూరులో చేర్చారు.. నలుగురు అభ్యర్దిత్వాల్లో ఎవరు కావాలి.. ఎవరైతే పార్టీకి విజయావకాశాలు ఉంటాయన్న దృష్టితో సర్వే సాగించినట్లు సమాచారం.


నరసాపురం నియోజకవర్గంలో గెలుపోటములు, ఓటింగ్ సరళిలో హెచ్చుతగ్గులు సామాజిక సమీకరణపైనే ఆధారపడి ఉంటాయి.. ఇప్పటిదాకా గెలుపొందిన అభ్యర్థుల మెజారిటీ ప్రత్యర్థి సామాజిక వర్గ సమీకరణాలపైనే ఆధారపడుతూ వస్తోంది.. మరోవైపు నరసాపురం నియోజకవర్గంలో టీడీపీలోనే రెండు వర్గాలు ఉన్నాయి.. ఒకరంటే ఇంకొకరికి పడదు.. నియోజకవర్గ ముఖ్య నాయకుల మధ్య అంతరం అదే విధంగా ఉంది.. ఇటువంటి రాజకీయ సమీకరణాల నేపథ్యంలో టీడీపీ అధిష్ఠానం నరసాపురంలోనూ వివరాలను రాబట్టే ప్రయత్నం చేసింది.. ముఖ్యంగా ప్రస్తుత ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, కాపు కార్పోరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడుల పేరుతో సర్వే సాగింది.. వీరిద్దరిలో ఎవరైతే వచ్చే ఎన్నికల్లో పార్టీకి సానుకూలంగా ఉంటుందన్న విషయంపైనే దూతలు దృష్టి పెట్టారు.. వీరిద్దరు కాకపోతే ఇంకెవరైతే బాగుంటుందన్న కోణంలోనూ అంతర్గత సర్వే సాగింది.. అలాగే మిగతా నియోజక వర్గాల్లోనూ సర్వే జరుపుతున్నట్టు సమాచారం.