టీడీపీ కీలక మీటింగ్ లో బద్దలైన అగ్నిపర్వతాలు... షాకైన చంద్రబాబు

 

చంద్రబాబుతో మీటింగ్ అంటే, సాధారణంగా ఆయనే మాట్లాడారు. ఆయనే చెబుతారు. ఎంత పెద్ద లీడరైనా, బాబు కంటే సీనియర్ అయినాసరే సెలైంట్ గా వినాల్సిందే. అలాంటింది పార్టీ ఘోర ఓటమి తర్వాత జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో అగ్నిపర్వతాలు బద్దలయ్యాయి. తమ ముందున్నది పార్టీ అధినేత అనే సంగతి మర్చిపోయి లావా లాంటి మాటలతో విరుచుకుపడ్డారు. రొటీన్‌కు భిన్నంగా హండ్రెడ్ డిగ్రీస్ సెల్సియస్ లో హాట్‌హాట్‌గా సాగిన మీటింగ్ లో ఒకరిద్దరు నేతలు నిప్పులు చెరిగారు. తమ గుండెల్లో దాగున్న బాధనంతా వెళ్లగక్కారు. ఎన్నడూ అధినేత మాటకు ఎదురుచెప్పని లీడర్లు కళ్లెర్ర చేశారు. ఇదేనా పార్టీలో క్రమశిక్షణ, ఇంతేనా పార్టీలో కొందరి నేతల బాధ్యతా అంటూ శివాలెత్తారు.

జగన్ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలైనా కాలేదు, అప్పుడే విమర్శలేంటంటూ అయ్యన్నపాత్రుడు అసహనం వ్యక్తంచేశారు. కొత్త సర్కారుకు కొంత సమయం ఇద్దాం, తప్పులు చేయనిద్దాం, ఆ తప్పులు ప్రజల్లోకి వెళ్లేవరకు ఆగుదాం, ఆ తర్వాతే ప్రజల తరపున రోడ్డెక్కుదామంటూ తన వాదనను కుండబద్దలు కొట్టారు. ఇప్పుడే విమర్శలుచేస్తే టీడీపీ అత్యుత్సాహం ప్రదర్శిస్తోందన్న తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయంటూ చంద్రబాబు ముందు గట్టిగానే వాదించారట. అయినా ఆకలేసినప్పుడే అన్నం పెట్టాలి... అప్పుడే అన్నం విలువ తెలుస్తుందని, ముందే పెడితే ప్రజలకు అర్ధంకాదంటూ అయ్యన్న చెలరేగి మాట్లాడినట్లు తెలుస్తోంది. ప్రజలకు తాను చెప్పే నిర్ణయాలు కొందరికి నచ్చకపోవచ్చంటూనే, పరోక్షంగా లోకేష్, దేవినేని ఉమాపై విరుచుకుపడినట్లు తెలిసింది. ప్రతి విషయానికీ ట్విట్టర్లోనో, లేదంటే తిట్ల దండకాలో ఎందుకంటూ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అంతేకాదు పార్టీ ప్రక్షాళన విషయంలో చంద్రబాబు మొహమాటపడకుండా, కఠిన నిర్ణయాలు తీసుకోవాలని అయ్యన్న సూచించారు.

ఇక టీడీపీలో అత్యంత సీనియర్‌ లీడరైన గోరంట్ల బుచ్చయ్యచౌదరి కూడా, గట్టిగానే మాట్లాడారు. ఓడిపోయిన నేతలను ఇంకా నెత్తిన పెట్టుకుని ఊరేగడం కరెక్టు కాదన్నారు. పార్టీలో స్వార్థపరులకు పదవులు ఇస్తున్నారని, లాయలిస్టులకు అన్యాయం చేస్తున్నారని చంద్రబాబు ముందే గుండెల్లో బాధను గోరంట్ల బయటపెట్టారు. కొంతమంది డబ్బు సంపాదించి, పదవులు అనుభవించి వెళ్లిపోతున్నారని, ఇకనైనా అలాంటి తెల్ల ఏనుగులను పక్కన పెట్టాలని కోరారు. పార్టీలో యువతకు, మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని, అవసరమైతే తన టీడీఎల్పీ ఉపనేత పదవిని బీసీకి ఇవ్వాలని సూచించారు. అయితే, బోండా ఉమతో పాటు కొందరు కాపు నేతలను ఉద్దేశించే గోరంట్ల ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. 

అయితే, ఎప్పుడూ గొంతెత్తని నేతలు గుండెల్లో బాధనంతా వెళ్లగక్కుతుంటే, వామ్మో, సీనియర్ నేతల్లో ఇంత ఆక్రోశం దాగుందా అంటూ చంద్రబాబు షాకైనట్లు తెలుస్తోంది. ఒకానొక టైమ్ లో అయ్యన్న సీరియస్‌గా మాట్లాడుతుంటే, కొంతమంది నేతలు వారించినట్టు తెలిసింది. అయితే వెనక్కి తగ్గని అయ్యన్న... నిజాలు మాట్లాడుకుని, లోపాలు సరిదిద్దుకుని, పార్టీని తిరిగి బలోపేతం చేసుకోవాలనేదే తన ఉద్దేశమని, ఆత్మస్తుతి, పరనిందలా సమావేశం జరిగితే ఉపయోగం ఉండదని రివర్స్ అయ్యారట. అతి విశ్వాసం, ప్రత్యర్థుల బలాన్ని తక్కువగా అంచనా వేయడం, కొందరు నేతల అవినీతిని చూసీచూడనట్టు వ్యవహరించడమే పార్టీ కొంపముంచిందని అన్నట్టు తెలిసింది. అయితే, నేతల మాటలను సావధానంగా విన్న అధినేత, ప్రతి ఒక్కరి సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకుని, పటిష్టమైన కార్యాచరణతో ముందుకెళ్దామని నేతలకు హామీ ఇచ్చారట.