విమర్శల వ్యూహం.. టీడీపీ నేతలు అందుకే మౌనంగా ఉన్నారు

 

ఏపీలో అధికార పార్టీ నేతలు చంద్రబాబు పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. రాజకీయ విమర్శల స్థాయి దాటిపోయి వ్యక్తిగత దూషణల వరకు వెళ్లే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వంశీ, తమ్మినేని వంటి నేతల విమర్శలు కాక పుట్టిస్తున్నాయి. ఆయా అంశాల పై మాట్లాడుతూ వారు వాడిన పదాలు తీవ్ర చర్చలకు దారి తీస్తుంది. ఎవరైనా.. ఏమైనా.. తిరిగి మాట్లాడితే తాను మరింత ఘాటుగా తిడతానని కొడాలి నాని మీడియా ముందే ప్రకటిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి వాటికి ధీటుగా కౌంటర్లు రావడం లేదు. దీని వెనుక టిడిపి పక్కా వ్యూహంతో వెళుతున్నట్లు కనిపిస్తోంది. 

మంత్రులు.. అధికార పార్టీ నేతల వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో వైసీపీ నేతల బూతుపురాణం వల్ల తమకు లాభమే తప్ప నష్టం ఉండదంటున్నారు టిడిపి నేతలు. రాజధాని ప్రాంతాన్ని శ్మశానంతో పోల్చడం వల్ల బాబు అమరావతి పర్యటనలకు మరింత ఊపొచ్చిందని టిడిపి భావిస్తోంది. బాబు అమరావతిలో టూర్ అనగానే బొత్స ఘాటుగా స్పందించారు. దీంతో చంద్రబాబు టూర్ అంశంపై అందరి ఫోకస్ పెరిగింది. బొత్స తీవ్ర వ్యాఖ్యల వల్లనే ఇప్పుడు బాబు టూర్ పై చర్చ పెరిగిందని టిడిపి నేతలు చెబుతున్నారు. 

ఇక తమ్మినేని సీతారాం, వల్లభనేని వంశీ, కొడాలి నాని వంటి వారు చంద్రబాబు.. లోకేష్ ల మీద చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా మంత్రి కొడాలితో పాటు వంశీ చేస్తున్న ఘాటు విమర్శల వల్ల వారికే నష్టం జరుగుతుందని టిడిపి నేతలు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర పాలనా వ్యవహారాలు.. ప్రభుత్వ పథకాలపై జరగాల్సిన చర్చలు.. వైసీపీ మంత్రులు.. నేతల ఘాటు విమర్శల వైపు డైవర్ట్ అవుతుండటం తమకు ప్లస్ అవుతుందంటున్నారు. ముందు నుంచి చంద్రబాబుపై అధికార పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు రానున్న రోజుల్లో వారికే నష్టం చేస్తాయని టిడిపి నేతలు లెక్కలేసుకుంటున్నారు. ముఖ్యంగా చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులపై చేస్తున్న విమర్శల్లో వాడుతున్న భాష పై ప్రజల్లోనూ చర్చ జరుగుతుందని టిడిపి భావిస్తోంది. 

ప్రస్తుతం మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు ప్రభుత్వానికి చుట్టుకుంటాయని కేబినెట్ లో ఉండేవారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రజలు హర్షించరని టిడిపి నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ కారణంగానే తమ పార్టీ నేతలు కౌంటర్ విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ చెప్తోంది. వైసీపీ నేతలు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లే ఇప్పటికీ మాట్లాడుతున్నారని దీనివల్ల అధికార పార్టీనే నష్టపోయే పరిస్థితి ఉందని టిడిపి నేతలు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కలతోనే చంద్రబాబుపై విమర్శలు చేసినా టిడిపిలోని ముఖ్య నేతలు ఆచితూచి కౌంటర్ ఇస్తున్నట్టు తెలుస్తోంది.