టీడీపీకి షాక్.. అవంతి, పండుల బాటలో మరో ఎంపీ!!

 

అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్, అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు బాటలోనే.. కాకినాడ ఎంపీ తోట నర్సింహం కూడా టీడీపీని వీడి వైసీపీలో చేరతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అనారోగ్యం కారణంగా తాను రాబోయే ఎన్నికల్లో పోటీచేయడం లేదంటూ ప్రకటించిన నర్సింహం.. ఆయన భార్య వాణికి టికెట్ ఇవ్వాలని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబును కలిసి విజ్ఞప్తి చేశారు. కీలకమైన జగ్గంపేట టీడీపీ టికెట్ తన భార్యకు ఇవ్వాలని చంద్రబాబుకి విన్నవించడం ద్వారా నర్సింహం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకి ఇప్పటికే టీడీపీ టికెట్ ఖరారైనట్టు సమాచారం ఉంది. ఇది తెలిసి కూడా నర్సింహం టికెట్ అడగడం పార్టీని వీడుతున్నానంటూ చెప్పుకోవడానికి కారణం కోసమేననే వాదన ఉంది.

జగ్గంపేట టికెట్ ఇవ్వకపోతే.. వైసీపీలోకి వెళ్లిపోవాలని తోట నర్సింహం భావిస్తున్నట్లు సమాచారం. జగ్గంపేట టికెట్ ను వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచి, ఆ తరువాత టీడీపీలో చేరిన జ్యోతుల నెహ్రూకే టీడీపీ అధిష్టానం ఖరారు చేసినట్టు తెలుస్తుండగా, ఈ విషయం తెలిసి కూడా నర్సింహం ఇదే స్థానాన్ని ఆశించడం వెనుక ఆయన రాజకీయ వ్యూహం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే టీడీపీకి రాజీనామా చేసి, వైసీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్న ఆయన, కారణం చెప్పుకోవడానికే జగ్గంపేట టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

2014 ఎన్నికలకు ముందు వరకూ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మంత్రిగానూ పనిచేసిన ఆయన, ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి కాకినాడ నుంచి ఎంపీగా బరిలోకి దిగి గెలిచారు. తాజాగా, చలమలశెట్టి సునీల్ టీడీపీలో చేరనుండటంతో తోట నర్సింహానికి సీటు లభించే పరిస్థితి లేదు. అందుకే ఆయన పోటీకి దూరంగా ఉండి.. టీడీపీలో తన భార్యకైనా టికెట్ లభిస్తే, పార్టీలో ఉండాలని, లేకుంటే మరో పార్టీలోకి మారాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక తోట నర్సింహం వైసీపీలో చేరినా.. జగ్గంపేట టికెట్ హామీ లభించడం కష్టమేనని తెలుస్తోంది. ఎందుకంటే, ఇప్పటికే జ్యోతుల చంటిబాబు ఆ నియోజకవర్గంలో వైసీపీ సమన్వయకర్తగా ఉన్నారు. జగన్ టికెట్ కూడా ఆయనకే ఖరారు చేసినట్టు వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో తోట నర్సింహం ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.