పార్టీ మార్పుపై కేశినేని నానీ స్పందన!!

 

టీడీపీలో గత కొంత కాలంగా పార్టీ మారతారని ప్రచారం జరిగినా విజయవాడ ఎంపీ కేశినేని నానీ పార్టీ మారలేదు కానీ అనూహ్యంగా నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారు. బిజెపిలో చేరిన వారినుద్దేశించి లోక్ సభ సభ్యులు ముగ్గురూ ( కేశినేని నాని, గల్లా జయదేవ్, కింజారపు రామ్మోహన్ నాయుడు) మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో కేశినేని నాని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

తాను బిజెపిలో చేరబోతున్నట్లు వచ్చిన వార్తలను కేశినేని నానీ ఖండించారు . ఇక పార్టీ మార్పుపై ఆయన మాట్లాడుతూ పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని కేశినేని నాని స్పష్టంచేశారు. తాను కేంద్ర మంత్రుల్ని కలవటంలో ఎలాంటి రహస్యం లేదన్నారు. ప్రధాని మోడీని కలవడంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, ఒక ఎంపీగా తాను ఎవరినైనా కలుస్తానని, మోడీ ప్రధాని కాబట్టి కలిశానని అవసరం అనుకుంటే ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కూడా కలుస్తానని, ఇంకా అవసరం అయితే మంత్రుల వద్దకైనా వెళ్తానని చెప్పారు. ఒక ఎంపీగా నియోజకవర్గ అభివృద్ధి కోసం అవసరం అనుకుంటే భవిష్యత్ లో కూడా అందర్నీ కలుస్తానని దానికి మీడియా పెడార్ధాలు తీయటం మానుకోవాలని ఆయన అన్నారు.

ఏపీ ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎప్పుడు సాధిస్తారో జగన్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు. జగన్ ప్రత్యేక హోదా కోసం ప్రయత్నించినా, పొర్లు దండాలు పెట్టినా, తలకిందులుగా తపస్సు చేసినా బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వదని తేల్చి చెప్పారు. తాము ప్రత్యేక హోదా కోసం అడిగి అడిగి విసిగిపోయామని ప్రత్యేక హోదా అనేది ఒక ముగిసిన అధ్యాయం అని నానీ అన్నారు.