ముగింపులు లేని బుజ్జగింపుల్లో చంద్రబాబు!

 

నవ్యాంధ్ర సీఎం చంద్రబాబుకు ప్రత్యేక హోదా అతి పెద్ద సమస్య. కానీ, టీడీపీ అధినేత చంద్రబాబుకి సమస్యేంటి? బోలెడు! అలాగే వుంది పరిస్థితి. తాజాగా ఆయన పిలిచి మాట్లాడక అనంతపురం సీనియర్ నేత జేసీ చల్లబడ్డారు. ఆయనసలు అలకబూనటానికి కారణం ఏంటి? అదీ స్పష్టంగా తెలియదు. మీడియాలో వచ్చే రకరకాల ప్రచారాలే తప్ప దివాకర్ రెడ్డి నేరుగా తన డిమాండ్లు ఇవ్వంటూ ఎవరికీ చెప్పలేదు. అలాగే, చంద్రబాబు కూడా పబ్లిగ్గా ఏమీ మాట్లాడలేదు. కానీ, జేసీ డిమాండ్స్ లో ఎన్ని న్యాయబద్ధమైవి, ఎన్ని కాకపోయినా… కీలక సమయంలో పార్టీకి, పార్టీ అధినేతకి ఇబ్బందికరంగా మాత్రం మారాయని చెప్పక తప్పదు. మోదీని ఢీకొంటూ చంద్రబాబు దిల్లీలో మంత్రాంగం నడుపుతుంటే… టీడీపీ ఎంపీ అయ్యి వుండి జేసీ అనంతపురంలో అలక పాన్పు ఎక్కారు. పార్లమెంట్ కు పోనని పేచీ పెట్టారు. ఎలాగో సర్ది చెప్పిన టీడీపీ అధినేత ఇతర పార్టీల ఎంపీల్ని మద్దతివ్వమన్నట్టు తన స్వంత పార్టీ ఎంపీనే బుజ్జగించాల్సి వచ్చింది. ఇది ఎంత మాత్రం హర్షనీయం కాదు!

 

 

అవిశ్వాస తీర్మానం అంకం ముగిశాక జేసీ ఇవాళ్ల చంద్రబాబుని కలిశారు. ఇలాంటి సమస్యల్ని ఎదుర్కోవటంలో అపార అనుభవం వున్న చంద్రబాబు లోపల ఏం మంత్రం వేశారోగానీ దివాకర్ రెడ్డి పూర్తిగా మెత్తబడ్డారు. లోపలేం జరిగిందో తాను చెప్పను అంటూనే లోక్ సభకు వెళతానని స్పష్టం చేశారు. మోదీ పీఎంగా వున్నంత కాలం విభజన హామీలు నెరవేరవని మరోమారు అన్న ఆయన పోరాటం మాత్రం సాగుతూనే వుండాలని చెప్పుకొచ్చారు. అసలింతకీ, దివాకర్ రెడ్డి ఏం అడిగారు? చంద్రబాబు ఎలా సముదాయించారు? ఇదంతా ఇప్పటికైతే సీక్రెట్టే! బహుశా వచ్చే ఎన్నికల్లో తనకు, తన వారసుడికి టికెట్ల గురించి దివాకర్ రెడ్డి పట్టుబట్టి వుంటారు.ఇది కూడా జరుగుతున్న ప్రచారమే తప్ప అధికారికంగా ఎక్కడా ఎవరూ చెప్పటం లేదు.

 

 

దివాకర్ రెడ్డి లాగే గతంలో గంటా శ్రీనివాసరావు కూడా పార్టీకి, చంద్రబాబుకి కాస్త ఇబ్బందికర పరిస్థితి ఉత్పన్నం చేశారు. సీఎం స్వయంగా ఆయన్ని పిలిచి మాట్లాడాల్సి వచ్చింది. ఇక దఫదఫాలుగా కొనసాగిన నంద్యాల నియోజక వర్గ వర్గపోరు సంగతి చెప్పనక్కర్లేదు. చంద్రబాబు ఒకటికి రెండు సార్లు వాళ్లని పిలిచి కూర్చోబెట్టి సముదాయించాల్సి వచ్చింది. ఇలా పదే పదే పుట్టుకొస్తున్న పార్టీ అంతర్గత కలహాలు లేదా కుమ్ములాటలు, అసంతృప్తులు అధినేత సమయాన్ని వృథా చేస్తున్నాయి. రాష్ట్ర రథసారథిగా ఆయన సమయం అమూల్యమైంది. దాన్ని స్వంత పార్టీ నేతలే వృథా చేయిస్తుండటం ప్రభుత్వానికి, ప్రజలకి కూడా నష్టమే. ముందు ముందు ఎన్నికలు సమీపిస్తే ఈ అలకలు, బుజ్జగింపులు మరింత పెరుగుతాయేమోనని కింది స్థాయి కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు! దీనిపై చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి మరి…