గోళ్లతో గిచ్చి...చొక్కా చింపారు... పోలీసుల దాష్టీకంపై గల్లా ఆవేదన...

అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో అరెస్టై జైలుకెళ్లిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు బెయిల్ లభించింది. 10వేల రూపాయల పూచీకత్తుపై మంగళగిరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాంతో, గుంటూరు సబ్ జైలు నుంచి జయదేవ్ విడుదల అయ్యారు. జైలు నుంచి రిలీజైన గల్లా జయదేవ్... పోలీసులు తన యెడల ప్రవర్తించిన తీరును మీడియాకి వివరించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులే తమతో దురుసుగా ప్రవర్తించారని గల్లా జయదేవ్ అన్నారు. మహిళలు, వృద్ధులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేయడంతో తాను అక్కడ బైఠాయించానని, దాంతో పోలీసులు తనపైకి దూకుడుగా వచ్చారని అన్నారు. అయితే, పోలీసుల లాఠీఛార్జ్ నుంచి మహిళలు, రైతులే తనను కాపాడారని గల్లా జయదేవ్ తెలిపారు. సీఆర్పీఎఫ్ సిబ్బందితో ప్రణాళిక ప్రకారమే దాడి చేయిస్తున్నారని గల్లా జయదేవ్ ఆరోపించారు. పోలీసులు తన పట్ల దారుణంగా వ్యవహరించారని, తన చేతులు వెనక్కిలాగిపట్టి గోళ్లతో గిచ్చి... చొక్కా చింపేశారని ఆవేదన వ్యక్తంచేశారు. ఆ తర్వాత తనను అదుపులోకి తీసుకుని దాదాపు 15 గంటలపాటు పోలీస్ వాహనంలో తిప్పి ఇబ్బంది పెట్టారని అన్నారు. ఒక ఎంపీ పరిస్థితే ఇలాగుంటే... ఇక సామాన్యులతో పోలీసులు ఎలా వ్యవహరిస్తారో అర్థమవుతుందన్నారు.

తనకు 149 సెక్షన్ కింద నోటీసు ఇవ్వలేదని, తన ఇంటికి కూడా నోటీసులు అంటించలేదని, అందుకే తాను శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ముందుకొచ్చానని, కానీ పోలీసులు మాత్రం వైలెంట్‌గా ప్రవర్తించారన్నారు. ఒకానొక దశలో ఎస్పీ తనను కొడతారని భయపడ్డానని, ఎస్పీ చేతిలో లాఠీ ఉందని జయదేవ్ అన్నారు. వైద్య సదుపాయం కావాలని కోరినా పోలీసులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు జీపులోనే వైద్య పరీక్షలు చేసి...జైలుకి పంపారని మండిపడ్డారు. ఒక ఎంపీకే ఇలా ఉంటే...సామాన్యుల పరిస్థితి ఏంటని గల్లా జయదేవ్ ప్రశ్నించారు. పోలీసులు గిచ్చుతున్నారంటే ఏంటో అనుకున్న....ఇప్పుడు తనకు బాగా తెలిసిందని జయదేవ్ అన్నారు. పోలీసులపై ఎవరూ రాళ్లు వేయలేదని, పోలీసులే వాళ్లపై మట్టిపెళ్లలు వేసుకుని కావాలని లాఠీఛార్జ్‌ చేశారని గల్లా జయదేవ్ తెలిపారు.