ఒక పరాజయం 100 తప్పులు.. టీడీపీ దుంప తెంచిన ఫిరాయింపులు

 

అప్పట్లో ఫిరాయింపులకు వ్యతిరేకంగా పోరాడిన టీడీపీ.. 2014 లో అధికారంలోకి వచ్చిన తరువాత ఫిరాయింపులను ప్రోత్సహించి విమర్శలు ఎదుర్కొంది. అటు కార్యకర్తల్లో, ఇటు ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకొని.. పతనం దిశగా అడుగులు వేసింది.

ఫిరాయింపుల విషయంలో టీడీపీ తీవ్ర విమర్శలు ఎదుర్కోవడానికి ప్రధాన కారణం ఆ పార్టీ రెండు నాలుకల ధోరణి. ఓ వైపు తెలంగాణలో అధికార టీఆర్ఎస్ తమ పార్టీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్ని కొన్నట్టు కొంటుంది అంటూ గోల చేసిన టీడీపీ.. తీరా ఏపీలో అదే ఫిరాయింపులను ప్రోత్సహించింది. అప్పటి ప్రతిపక్ష వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలను, నేతలను పార్టీలో చేర్చుకొని విమర్శలు ఎదుర్కొంది. అంతేకాదు ఫిరాయింపు నేతలకు పదవులు కట్టబెట్టి ఎప్పటినుంచో పార్టీనే నమ్ముకొని ఉన్న నేతల్లో అసంతృప్తిని కలిగించింది. తమ మీద పోటీ చేసిన నేతలు, ఇప్పుడు తమ పార్టీలోకి వచ్చి తమ మీదే పెత్తనం చెలాయించడం వారు తట్టుకోలేకపోయారు. ఈ ఫిరాయింపుల వల్ల కార్యకర్తల్లో కూడా అసహనం పెరిగింది. మొన్నటివరకు తమ నాయకులను, తమ పార్టీని తిట్టిన వారికి.. ఇప్పుడు తాము జై కొట్టాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేసారు. మరోవైపు ఈ ఫిరాయింపులను వైసీపీ అస్త్రంగా మలుచుకొని ఈ విషయాన్నీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. దీంతో ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. మొత్తానికి ఫిరాయింపులు కూడా ఓ రకంగా టీడీపీ ఓటమికి కారణమయ్యాయనే చెప్పాలి.