ఆ నలుగురు ఫిరాయింపు నేతలపై టీడీపీ నేతల కామెంట్లు!!

 

తెలుగు దేశం పార్టీ నుండి నలుగురు రాజ్య సభ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్, గరికపాటి మోహన్ రావు, టీజీ వెంకటేశ్ లు బీజేపీలో చేరిపోయారు. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇలా చెయ్యటం ఏ మాత్రం కరెక్ట్ కాదని ఫిరాయింపు నేతలపై మండిపడుతున్నారు టీడీపీ నేతలు. ఇక పార్టీ మారిన రాజ్యసభ సభ్యులపై పలువురు టీడీపీ కీలక నేతలు తమదైన శైలిలో విరుచుకుపడ్డారు.

చంద్రబాబునాయుడు:
టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరడంపై విదేశీ పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. సంక్షోభాలు పార్టీకి కొత్త కాదని, కార్యకర్తలెవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. సీనియర్‌ నేతలతో మాట్లాడారు. కొందరితో వీడియో కాన్ఫరెన్సులో కూడా మాట్లాడారు. బీజేపీతో ఉండాలనుకుంటే అలాగే కొనసాగాం. కానీ ఆంధ్రులకు ద్రోహం చేసిన పార్టీతో మా స్వార్థం కోసం ఉండలేకపోయాం. ప్రత్యేక హోదా, రాష్ట్ర ప్రయోజనాల కోసమే తెదేపా భాజపాతో పోరాడింది. భాజపా ఇలాంటి చర్యలకు పాల్పడటం అనైతికం అని ఆయన అన్నారు.

వర్ల రామయ్య:
ఫిరాయింపు ఎంపీలపై టీడీపీ నేత వర్ల రామయ్య ఘాటు స్పందించారు. పనికిమాలిన నలుగురు ఎంపీలు వెళ్లిపోయినంత మాత్రాన టీడీపీకి వచ్చిన నష్టమేమీలేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అరెస్ట్ భయంతో అండర్ గ్రౌండ్‌కు వెళ్లిన సుజనాచౌదరిని బీజేపీ నేతలు ఎలా తీసుకున్నారని అడిగారు. సుజనాకు ఏం క్లీన్‌చిట్ ఉందని బీజేపీలోకి తీసుకున్నారో తెలియట్లేదన్నారు. అయినా వారు ప్రజల్లోంచి వచ్చిన రాజకీయ నేతలు కాదన్నారు. చంద్రబాబు దయాదాక్షిణ్యాలపై పదవులు పొందినవారని గుర్తుచేశారు. వారంతా స్వప్రయోజనాల కోసమే పార్టీ మారారన్నారు.

ఆశోక్ గజపతి రాజు 
రాజకీయాల్లో నిలకడ ఉండాలని మాజీ కేంద్ర మంత్రి ఆశోక్ గజపతి రాజు అభిప్రాయపడ్డారు. పార్టీ మారిన టీడీపీ ఎంపీలు నిలకదలేనూలని ఆయన అన్నారు . టీడీపీకి కార్యకర్తల బలం ఉందని చెప్పారు. కార్యకర్తల నుండి నాయకులు తయారు కావాల్సిన అవసరం ఉందన్నారు. అలా కార్యకర్తల నుండి నాయకులను తయారుచేసిన చరిత్ర టీడీపీకి ఉందని చెప్పారు.

కనకమేడల రవీంద్ర కుమార్
37 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో 5 సార్లు గెలిచి 4 సార్లు ఓడిపోయామన్నారు. ఓడిపోయిన పార్టీలు అంతరించిపోవాలా? ఇదేనా మోడీ ఆలోచన? అని కనకమేడల రవీంద్రకుమార్ ప్రశ్నించారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ జరగలేదని. తమను ఎవరూ సమావేశానికి పిలవలేదని, చట్ట ప్రకారం ఎంపీల విలీనం జరగలేదన్నారు. అది విలీనం కాదని ఫిరాయింపు కిందకు వస్తుందని కనకమేడల తెలిపారు. ఇక ఓడిపోయినప్పుడు పార్టీని మూడ్ ఆఫ్ ది నేషన్ అంటూ మూసేయలేదని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని కనకమేడల తెలిపారు.

గల్లా జయదేవ్
ఆ నలుగురు సొంత ప్రయోజనాల కోసమే బీజేపీలో చేరారు. రాజ్యసభలో టీడీపీ పార్లమెంటరీ పార్టీని బీజేపీలో విలీనం చేయాలని కోరుతూ నలుగురు ఎంపీలు రాజ్యసభ చైర్మన్ కు లేఖ ఇచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలియకుండా వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయమై న్యాయపరమైన అభిప్రాయం తీసుకుంటాం. తాజా ఎన్నికల్లో టీడీపీకి 40% ఓట్లు వచ్చాయి. పార్లమెంటులో ప్రజల గొంతుకను వినిపిస్తాం అని అన్నారు.

రామ్మోహన్ నాయుడు
రాజకీయ హోదా, గౌరవం కల్పించిన పార్టీకి ద్రోహం చేయడం బాధాకరం అన్నారు. బీజేపీ ఫిరాయింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నా అని అన్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో టీడీపీకి 40% ఓట్లు వచ్చాయి. పార్టీ బలహీనపడుతోందన్న ఆలోచన ఏ ఒక్కరికీ రాకూడదు. మా అజెండా కొనసాగిస్తామని, రాష్ట్ర అంశాలపై బలంగా పోరాడతాం. పార్టీ సిద్ధాంతాలను వదలుకోం, టీడీపీ తరపున పోరాటాలు కొనసాగిస్తాం. టీడీపీని బలోపేతం చేసే దిశగా కృషి చేస్తాం అని అన్నారు.

ప్రత్తిపాటి పుల్లారావు
టీడీపీకి సంక్షోభాలు కొత్త కాదని, రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరుతున్నందువల్ల పార్టీకి వచ్చిన ఇబ్బందేమీ లేదని పుల్లారావు స్పష్టం చేశారు. రాజకీయాల్లో విలువలు లేవని, సుజనా వంటి నేతలు వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.

గద్దె రామ్మోహన్
రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ నుంచి బయటకు వెళ్లామన్న సుజనా చౌదరి వ్యాఖ్యలు హాస్యాస్పదం. సొంత ప్రయోజనాల కోసమే ఆ నలుగురు ఎంపీలు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీని నమ్మక ద్రోహం చేసి బీజేపీలో చేరారు. ప్రజా క్షేత్రంలో బలం లేని నేతలను బీజేపీలోకి తీసుకోవడం ద్వారా ఆ పార్టీ ఏం ఆశిస్తోందో అర్థం కావట్లేదు అని అన్నారు.

బుద్ధా వెంకన్న
పార్టీ మారిన ఎంపీలు చచ్చు దద్దమ్మలు. బీజేపీ ఎంపీ జీవీఎల్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వంటి నేతలు తాము నమ్ముకున్న పార్టీ కోసం నిలబడ్డారు. అధికారంలో లేకుండా వీరు నెల రోజులు కూడా పార్టీలో ఉండలేకపోయారు అని అన్నారు.

దేవినేని ఉమ
పార్టీ ఎన్నో సంక్షోభాలు చూసింది. ఈ ఎంపీలు మాత్రం పిరికిపందల్లా వ్యవహరించారు. సీఐడీ, ఈడీ కేసులకు భయపడి ఈ ఎంపీలు పార్టీని వీడారు. బీజేపీ కండువాలు కప్పుకున్నారు అని తూర్పారబట్టారు.

కాల్వ శ్రీనివాసులు
సుజనా చౌదరి, సీఎం రమేశ్ వంటి నేతలు చంద్రబాబుపై నమ్మకం కలిగినవారే అయినా, ఎన్నికల ఫలితాల అనంతరం తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. ఇంత తక్కువ సమయంలో పార్టీని వీడతారని అనుకోలేదు. చంద్రబాబు విదేశీ యాత్ర నుంచి వచ్చాక తెలుగుదేశం పార్టీ బలోపేతం చేయడంపై చర్చిస్తాం. టీడీపీకి ఇలాంటి సంక్షోభాలు కొత్తకాదు. పార్టీ ఈ కష్టాలను తట్టుకుని నిలబడుతుంది అని అన్నారు.

ఆలపాటి రాజా
టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజా మాట్లాడుతూ పార్టీ మారిన నలుగురు విశ్వాస ఘాతకులు అని వ్యాఖ్యానించారు. వాళ్లు బీజేపీలోకి వెళ్లినా టీడీపీ కోవర్టులు అనుకుంటున్నారని, నలుగురు పోతే 40 వేల మంది నాయకులు అవుతారని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీని వీడటంతో పాటు టీడీపీని బీజేపీలో విలీనం చేయమనడం సిగ్గుచేటన్నారు.

అయ్యన్నపాత్రుడు
తెలుగుదేశం పార్టీ శ్రేణులారా... కని పెంచిన తల్లిని వదిలి వెళ్లిపోయే వాళ్ళ కోసం ఆలోచించకండి... ఆ తల్లిని కాపాడుకోవడానికి నాలాంటి కొడుకులు ఎంతో మంది ఉన్నారు .. నాకు తోడు ఎంతో మంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఉన్నారు... మనది వ్యక్తి మీద ఆధార పడే పార్టీ కాదు వ్యవస్థ మీద ఆధారపడే పార్టీ, మన పార్టీ కలకాలం నిలచి ఉండేది.. ఆ మోనార్క్ లు ఓడిపోతే వాళ్ళ పార్టీలు చరిత్రలో కలిసి పోతాయి.. మనకు ఎంతో మంది ముఖ విలువ గల నాయకులు ఉన్నారు... ఇంకా 58 నెలలే మన కష్టాలు." అని కార్యకర్తలకు భరోసా ఇస్తూ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు.
మరో పోస్ట్ లో.. "తెలుగు నేల, తెలుగు జాతి, తెలుగు భాష ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ ఉంటుంది... టీడీపీ వ్యక్తుల పేరు మీదో, ప్రాంతాల పేరుతోనో, సెంటిమెంట్ ని నమ్ముకునో పెట్టలేదు... తెలుగోడి ఆత్మాభిమానాన్ని నమ్ముకుని పెట్టింది" అని పేర్కొన్నారు.