మండలి రద్దుపై ...టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ ఏమన్నాయంటే...

మండలిని రద్దు చేస్తూ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్ష తెలుగుదేశంతోపాటు బీజేపీ, కాంగ్రెస్ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. జగన్ నియంతృత్వ పోకడలకు ఇది నిదర్శనమంటున్నారు. మండలి రద్దు నిర్ణయంపై ఎవరేమన్నారో చూద్దాం...

(నారా లోకేష్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి)
మండలి రద్దు నిర్ణయంతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. బిల్లులు ప్రజాభిప్రాయానికి వెళ్తే జగన్ ఎందుకు భయపడుతున్నారని లోకేష్ ప్రశ్నించారు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు దక్కలేదని ఏకంగా కోర్టులనే రద్దు చేస్తారేమోనంటూ ఎద్దేవా చేశారు.

(దేవినేని ఉమామహేశ్వర్రావు, టీడీపీ సీనియర్ నేత)
శాసనమండలిని రద్దు చేస్తూ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఆయన అవివేకానికి నిదర్శనమని దేవినేని ఉమామహేశ్వర్రావు అన్నారు. ముఖ్యమంత్రి జగన్ కు పట్టిన పిచ్చి పరాకాష్టకు చేరిందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన దేవినేని ఉమా... నియంతలా వ్యవహరిస్తున్న జగన్మోహన్ రెడ్డికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

(యనమల రామకృష్ణుడు, టీడీపీ సీనియర్ నేత)
రాత్రికి రాత్రే ప్రజావేదికను కూల్చినంత తేలికగా శాసనమండలిని రద్దు చేయడం సాధ్యంకాదని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. 2021కల్లా మండలిలో వైసీపీకి మెజారిటీ వస్తుందని, మరి అలాంటప్పుడు కౌన్సిల్ ను రద్దు చేయాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. రద్దుకు తీర్మానం చేసినా... అమలు చేసేందుకు రెండు మూడేళ్లు పడుతుందని... అప్పటివరకు మండలి కొనసాగుతుందని అన్నారు.

(అచ్చెన్నాయుడు, టీడీపీ ఎమ్మెల్యే)
ఏడు నెలల్లో 32 బిల్లులు పంపితే మండలిలో తెలుగుదేశం వ్యతిరేకించలేదని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అన్నారు. అయితే, ప్రజాభీష్టానికి ప్రజావ్యతిరేకంగా ఉన్నందునే మూడు రాజధానుల బిల్లును అడ్డుకున్నామన్నారు.

(మాధవ్‌, బీజేపీ ఎమ్మెల్సీ)
దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకువచ్చిన శాసనమండలిని ఆయన తనయుడు జగన్‌ రద్దు చేయడం దురదృష్టకరమని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌ అన్నారు. శాసనమండలి రద్దులో వైసీపీ, టీడీపీ... రెండు పక్షాలూ దోషులేనన్న మాధవ్‌... ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం లేదన్నారు. 
 
(శైలజానాథ్‌, ఏపీపీసీ అధ్యక్షుడు)
శాసనమండలి రద్దు సీఎం జగన్‌ నియంతృత్వ పోకడకు నిదర్శనమని ఏపీపీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ అన్నారు. మండలిని రద్దు చేయాలనుకోవడం ద్వారా జగన్‌ తన ఓటమిని తానే ఒప్పుకున్నట్లన్నారు. సంఖ్యాబలం ఉందని ఏదిపడితే అది చేస్తానంటే కుదరదన్నారు.