కేసీఆర్ ట్రాప్ లో జగన్.. కాళేశ్వరం భవిష్యత్‌లో మ్యూజియం!

 

కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ఇండియా-పాకిస్థాన్‌లా అవుతాయని గతంలో చెప్పిన సీఎం జగన్‌ ఈరోజు ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఎలా వెళ్లారని టీడీపీ నేత బూరగడ్డ వేదవ్యాస్‌ ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుపై జగన్‌ గతంలో చేసిన వ్యాఖ్యల వీడియోను మీడియా ఎదుట ప్రదర్శించారు. ఏపీకి నష్టం చేసే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్ ఎలా వెళతారని ప్రశ్నించారు. ఈ విషయమై రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్, వైసీపీ నేతలు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా ఏపీకి వచ్చే నీటిని పూర్తిగా తన గుప్పిట్లో పెట్టుకోవడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జగన్‌ కేసీఆర్‌ ట్రాప్‌లో పడ్డారని.. అందుకే పిలవగానే వెళ్లారని అన్నారు. తెలంగాణ సర్కారుతో జగన్‌ ఏమి లాలూచీ పడ్డారో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. నీళ్లులేని ప్రాజెక్టుకి కేసీఆర్‌ వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్‌లో మ్యూజియంలాగా చూడటానికి తప్ప దేనికీ పనికిరాదని వేదవ్యాస్‌ అన్నారు.

కాకినాడలో టీడీపీకి చెందిన కాపు నేతల సమావేశంపై కూడా వేదవ్యాస్ స్పందించారు. నిన్నటి కాకినాడ మీటింగ్ పై అనుమానాలొద్దని, మంచి చెడులు మాట్లాడుకోవడం కోసమే భేటీ అయ్యామని స్పష్టం చేశారు. నిన్నటి సమావేశం రహస్యం కాదని, ఎన్నికల్లో తమ పార్టీ ఓటమికి గల కారణాలపై చర్చించినట్టు తెలిపారు.