కొడుకుపై విజయానికి తండ్రి మద్దతు కోరిన నేత

 

కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు కంచుకోట అయిన ఖమ్మం అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకొని,తొలిసారిగా తమ పార్టీ జెండా ఎగురవేయాలని టీఆర్ఎస్ విశ్వప్రయత్నాలు చేస్తుంది. టీడీపీ కూడా కేవలం ఒకే ఒక్కసారి మాత్రమే లోక్ సభ,అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్నప్పటికీ ప్రస్తుతం జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ మద్దతు ఉండటంతో టీడీపీ గెలుపు ఖాయం అని ధీమా వ్యక్తం చేస్తుంది.ఈ రెండు పార్టీల మధ్య ఓ సీనియర్ సీపీఐ నేత నలిగిపోతున్నారు. ఆయనే ఖమ్మం మాజీ ఎమ్మెల్యేగా, ఆ పార్టీ శాసనసభా పక్షనేతగా పనిచేసిన పువ్వాడ నాగేశ్వరరావు. గత ఎన్నికల్లో అయన తనయుడు అజయ్‌ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగి అప్పటి టీడీపీ నేత తుమ్మల నాగేశ్వరరావును ఓడించారు. రెండేళ్లు కాంగ్రెస్ లోనే కొనసాగి ఆ తర్వాత తన మిత్రుడు మంత్రి కేటీఆర్‌ ఆహ్వానం మేరకు టీఆర్ఎస్ లో చేరారు. ఆయన ఇప్పుడు కూడా టీఆర్ఎస్ తరుపున ఎన్నికల బరిలో ఉన్నారు.

మరోవైపు గతంలో ఖమ్మం ఎంపీ గా పనిచేసిన టీడీపీ నేత నామా నాగేశ్వరరావు ప్రస్తుత ఎన్నికల్లో అజయ్ కి ప్రత్యర్థిగా కూటమి తరుపున పోటీ చేస్తున్నారు. దీంతో పువ్వాడ నాగేశ్వరరావు సందిగ్ధంలో పడ్డారు. టీఆర్ఎస్ తరుపున పోటీ చేస్తున్న కొడుకు తరుపున మొగ్గుచూపుతారా లేక కూటమి ధర్మానికి కట్టుబడి నామా తరపున ప్రచారం చేస్తారా..? అనే చర్చ నియోజకవర్గం వ్యాప్తంగా సాగుతోంది.ఈ నేపథ్యంలోనే నామ నాగేశ్వరరావు పువ్వాడ నాగేశ్వరరావును ఆయన నివాసానికి వెళ్లి కలిసి మద్దతు కోరారు. అయితే తాను సీపీఐ నేతగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తానని, ప్రజాకూటమి ధర్మాన్ని పాటిస్తానని నామాకి  పువ్వాడ నాగేశ్వరరావు హామీ ఇచ్చినట్టు సమాచారం.సీపీఐ నేతగా ఖమ్మంలో చక్రం తిప్పిన పువ్వాడ నాగేశ్వరరావు కూటమికి మద్దతు ఇస్తారో లేక కొడుకు పక్కన నిలుస్తారో వేచి చూడాల్సిందే..