టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను నిన్నరాత్రి తూర్పుగోదావరి జిల్లా తుని మండలం సీతారాంపురం వద్ద కృష్ణ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రి పేర్ని నాని ప్రధాన అనుచరుడు, వైసిపి నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో కొల్లు రవీంద్ర హస్తం ఉందంటూ భాస్కర్ రావు కుటుంబసభ్యులు ఆరోపించారు. కొల్లు రవీంద్ర సపోర్ట్ తోనే ఈ హత్య జరిగిందంటూ భాస్కర్ రావు కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కొల్లు రవీంద్ర ఇంటిని పోలీసులు రెండు సార్లు సోదా చేశారు. ఐతే అయన ఆచూకీ మాత్రం దొరకలేదు. ఐతే నిన్న రాత్రి అయన విశాఖ కు వెళుతుండగా అరెస్ట్ చేసి విజయవాడ తరలించారు.

ఇది ఇలా ఉండగా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్ ను చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. అసలు కనీసం ప్రాథమిక విచారణ కూడా చేయకుండా రవీంద్రను అరెస్ట్ చేయడం ద్వారా వైసీపీ కక్ష సాధింపునకు దిగుతోందన్నారు. కావాలనే కక్షసాధింపుతో రవీంద్రను ఈ కేసులో ఇరికించారని బాబు ఆరోపించారు. ఎమర్జెన్సీ టైం లో కూడా ఇన్ని అరాచకాలు చూడలేదు. అప్పుడు కూడా ఇంతమందిని తప్పుడు కేసులలో ఇరికించలేదని అయన అన్నారు. బీసీల పైన వైసీపీ ప్రభుత్వం పగబట్టినట్లు వ్యవహరిస్తోందని చంద్రబాబు అన్నారు. అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, కొల్లు రవీంద్రలపై తప్పుడు కేసులే దీనికి నిదర్శనం అన్నారు.