దాన్ని కూడా బూతుగా చిత్రీకరించే నీచ మనస్తత్వం నీది

 

విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టడానికి విఫలయత్నం చేసి ఆపై సీఎం చంద్రబాబు మీద విమర్శలు చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై టీడీపీ మహిళా నేత దివ్యవాణి విమర్శలు గుప్పించారు. సమస్యను సమస్యగా మాట్లాడడం వర్మ నేర్చుకోవాలని అన్నారు. రాష్ట్రంలో పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సింది ఏమీ లేదని, లక్ష్మీపార్వతి చరిత్ర ఏంటో ఆమె మొదటిభర్త వీరగంథం గారు ఎప్పుడో చెప్పారని, ఇటీవలే కోటి అనే యువకుడు కూడా తాను ఎలా వేధింపులకు గురైందీ సోషల్ మీడియాలో వెల్లడించాడని దివ్యవాణి పేర్కొన్నారు.

ఎన్నికల వేడి కారణంగా రాజకీయ పార్టీలు, ప్రజలు తీవ్ర ఆవేశంలో ఉన్న తరుణంలో వర్మ ఏపీలో ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి చేసిన ప్రయత్నాలు సరికాదంటూ దివ్యవాణి అభిప్రాయపడ్డారు. వర్మ ప్రెస్ మీట్ పెడితే తలెత్తే పరిణామాలు, అల్లర్లను పోలీసులు ఊహించే ఆయనను అడ్డుకున్నారని.. పోలీసులు మంచి పనిచేశారని కితాబిచ్చారు. ఏపీలో 144 సెక్షన్ అమలులో ఉన్న సమయంలో ప్రెస్ మీట్ పెట్టుకుంటానని వచ్చిన వర్మ.. తనను పోలీసులు ఆపారని, అందుకు చంద్రబాబే కారణమని ఆరోపించడాన్ని దివ్యవాణి తప్పుబట్టారు. చంద్రబాబుపై నింద మోపడం చాలా బాధకరమని అన్నారు.

"వర్మ గారూ, ఇవాళ మీపై విమర్శలు చేయడానికి కూడా ఎంతో ఆలోచించాల్సి వస్తోంది. ఓ సంస్కారవంతుడైన నాయకుడి వద్ద మేం పనిచేస్తున్నాం. అందుకే ఎంతో బాధతో మాట్లాడాల్సి వస్తోంది. జాగ్రత్త! నీ కప్ప కనుగుడ్లని తెలుగింటి ఆడపడుచులు పీకిపడేసి నిన్ను కళ్లు లేని కబోదిని చేస్తారు. ఒక పసిబిడ్డ తల్లి వద్ద పాలు తాగుతున్నా కూడా దాన్నొక బూతుగా చిత్రీకరించే నీచ మనస్తత్వం నీది." అని విమర్శించారు.

"ఒకవేళ నీకు కోడికత్తి పార్టీ మీద ఆసక్తి కలిగితే ధైర్యంగా కండువా కప్పుకో. ఒక స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారం చేసుకో. అంతేతప్ప చంద్రబాబు గారితో పోల్చుకునే స్థాయి నీకు లేదు.  సీఎం పోస్టులో ఎవరున్నా గానీ వాళ్లకు మర్యాద ఇచ్చి మాట్లాడడం నేర్చుకోండి" అని హితవు పలికారు.

"దెయ్యాలు లేవు, దేవుళ్లు లేరు అనే వ్యక్తివి, ఎన్టీఆర్ ఆత్మ వచ్చి నాకు చెప్పింది, అందుకే సినిమా తీస్తున్నానంటూ నువ్వు కల్లబొల్లి కబుర్లు చెప్పడం. ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న జగన్, స్క్రిప్టు రైటర్ గా వ్యవహరిస్తున్న విజయసాయిరెడ్డి నీకు వంతపాడడం! ఏపీ ప్రజలేమీ అంత అమాయకులు కాదు. ఇతర రాష్ట్రాల్లో మీ సినిమా సంకనాకిపోయిందన్న సంగతి అందరికీ తెలుసు." అని ఎద్దేవా చేశారు.

"ఎన్టీఆర్ గారి జీవితంలోకి వచ్చే సమయానికి ఆమేమీ పదహారేళ్ల బాలాకుమారి కాదు. ఆమె కనీసం ఎన్టీఆర్ గారి వయసును కూడా గుర్తించకుండా స్టెరాయిడ్స్ ఇప్పించి చావుకు కారణమైంది. నారా, నందమూరి కుటుంబాలకు సంస్కారం ఉంది కాబట్టి ఆమె గురించి ఇప్పటివరకు ఏమీ మాట్లాడలేదు. అయినా ఎన్టీఆర్ గురించి సినిమా తీయడానికి బూతు దర్శకుడివైన నీకేం అర్హత ఉంది?" అంటూ మండిపడ్డారు.

"పక్కరాష్ట్రాల వాళ్లు కూడా ఎంతో గౌరవించే చంద్రబాబుపై విమర్శలు చేయడం కాదని, దమ్ము, ధైర్యం ఉంటే జగన్ కుటుంబంలో జరిగిన హత్యారాజకీయాలపై సినిమాలు తీయాలని సవాల్ విసిరారు. చంద్రబాబు ఘనతలపై పొరుగు రాష్ట్రాల వాళ్లు కూడా యూట్యూబ్ లో వీడియోలు పెడుతున్నారని, మీకొద్దంటే చెప్పండి మేం తీసుకెళతాం ఆయన్ని అని అంటున్నారని, అలాంటి వ్యక్తిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదు" అని హెచ్చరించారు.

"ఇవాళ తెలంగాణ ప్రజలకు తెలుస్తోంది చంద్రబాబు గారి విలువేంటో. 20 మంది ఇంటర్ విద్యార్థుల బంగారు భవిష్యత్తును, వాళ్ల తల్లిదండ్రుల సంతోషాన్ని మళ్లీ తీసుకురాగలరా? ప్రభుత్వం చేసిన తప్పు వల్ల ఎంతమంది బిడ్డలు ఆహుతైపోయారు? మరి ఆ తప్పులపై నీకు సినిమాలు తీసే దమ్ముంటే అప్పుడు నిన్ను నిజమైన డైరెక్టర్ అంటాం." అని దివ్యవాణి అన్నారు.