వైఎస్ తో నెహ్రూ... జగన్ తో అవినాష్... మళ్లీ పార్టీ మారతారంటూ ప్రచారం

 

తెలుగుదేశానికి కృష్ణాజిల్లాలో మరో భారీ షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ టీడీపీ వీడతారనే ప్రచారం జరుగుతోంది. రెండు నెలల క్రితమే ఈ మాట వినిపించినప్పటికీ, ఈ మధ్య చంద్రబాబు పిలుపునిచ్చిన ఛలో ఆత్మకూరు ఆందోళనలో ఫుల్ యాక్టివ్ గా పాల్గొనడంతో... పార్టీ మారే ఆలోచనను దేవినేని అవినాష్ విరమించుకున్నారేమోనన్న టాక్ వినిపించింది. అయితే, దేవినేని అవినాష్ పార్టీ మారతారంటూ మళ్లీ ప్రచారం ఊపందుకుంది. తాజాగా దేవినేని అవినాష్.... టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో సమావేశమైనట్లు తెలుస్తోంది. దాంతో త్వరలోనే అవినాష్ వైసీపీలో చేరడం ఖాయమంటున్నారు.

అవినాష్ తండ్రి దివంగత దేవినేని నెహ్రూకి కృష్ణాజిల్లాలో రాజకీయంగా పట్టుంది. జిల్లావ్యాప్తంగా దేవినేని కుటుంబానికి అభిమానులు, అనుచరులు ఉన్నారు. దేవినేని నెహ్రూ కుమారుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన అవినాష్ ... అతి తక్కువ సమయంలోనే యూత్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీచేసి వార్తల్లో నిలిచారు. ఇక, 2019లో గుడివాడ నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన అవినాష్.... ప్రస్తుత మంత్రి కొడాలి నానికి గట్టిపోటీనిచ్చారు. నువ్వానేనా అన్న స్థాయిలో దడ పుట్టించారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం ఘోర పరాజయంతో అవినాష్ చూపు వైసీపీ వైపు మళ్లింది. అసలు ఎన్నికలకు ముందు అవినాష్ ... వైసీపీలో చేరతారనే ప్రచారం కూడా జరిగింది. అయితే, అనూహ్యంగా టీడీపీలో చేరారు. ఇక, కొడాలి నానికి దీటైన అభ్యర్ధిగా అవినాష్ ను భావించిన చంద్రబాబు... గుడివాడ నుంచి బరిలోకి దింపారు. అయితే, వైసీపీలో హోరుగాలిలో అవినాష్ ఓటమి పాలైనా... యూత్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.  

ఇక, దేవినేని నెహ్రూ కుటుంబానికి వైఎస్ ఫ్యామిలీతోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన దేవినేని నెహ్రూ... ఆ తర్వాత ఎన్టీఆర్ కి అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. దేవినేని నెహ్రూ... వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యే కావడమే కాకుండా ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రిగానూ పనిచేశారు. అయితే, 1995 ఎపిసోడ్ తర్వాత కాంగ్రెస్ లో చేరి, వైఎస్ కుటుంబానికి దగ్గరయ్యారు. అలాగే, వైఎస్ ఫ్యామిలీతో దేవినేని నెహ్రూ కుటుంబానికి సత్సంబంధాలు ఉండటంతో... అవినాష్ వైసీపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఒకవేళ దేవినేని అవినాష్... వైసీపీలో చేరితే అది టీడీపీ నష్టమేనని చెప్పాలి. ఎందుకంటే దేవినేని నెహ్రూ కుటుంబానికి కృష్ణాజిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున అనుచరులు, అభిమానులు ఉన్నారు. వాళ్లంతా అవినాష్ వెంట నడిచే అవకాశముంది.