చింతమనేని అరెస్ట్.. రహస్య ప్రదేశానికి తరలింపు!!

 

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తనపై ఉన్న అట్రాసిటీ కేసుల కారణంగా చింతమనేని 12 రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు. అయితే తాజాగా పోలీసులకు లొంగిపోయేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన చింతమనేని.. ఆయన భార్యకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆమెను చూసేందుకు దుగ్గిరాలలోని తన నివాసానికి చింతమనేని వెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఆయనను ఏలూరు త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారని తెలుస్తోంది. మరోవైపు చింతమనేని ప్రభాకర్‌‌ను అరెస్టు చేసిన పోలీసులు రహస్య ప్రదేశానికి తరలించారని కూడా వార్తలొస్తున్నాయి.
 
అంతకుముందు చింతమనేని ప్రభాకర్ ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బుధవారం ఉదయం చింతమనేని ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. దీంతో ఆయన అనుచరులు పోలీసులను అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. చింతమనేని లొంగిపోతారని చెప్పినా ఎందుకు సోదాలంటూ అనుచరులు నిలదీశారు.