అన్నీ తన సామాజికవర్గానికే.. లోకేష్ పై కాపు నేతలు ఫైర్!!

 

తాజాగా కాకినాడలో టీడీపీకి చెందిన కాపు నేతలు రహస్య సమావేశమైన సంగతి తెలిసిందే. దీంతో కాపు నేతలు టీడీపీని వీడుతున్నారంటూ వార్తలొచ్చాయి. అయితే కొందరు నేతలు మాత్రం ఈ వార్తలను ఖండించారు. మరి వారు టీడీపీని వీడుతారో లేదో తెలీదు కానీ పార్టీ పట్ల మాత్రం అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా నారా లోకేష్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం.

ఈ సమావేశంలో ప్రధానంగా పార్టీలో కాపులకు జరుగుతున్న అన్యాయంపై చర్చ జరిగిందట. ముఖ్యంగా లోకేష్ ని టార్గెట్ చేస్తూ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. లోకేష్ తన సొంత సామాజిక వర్గానికే పార్టీలో పెద్దపీట వేస్తున్నారని, కాపు సామాజిక వర్గాన్ని అసలు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన నేతలు.. కాపు ప్రజా ప్రతినిధులు కలవడానికి కూడా సమయం ఇవ్వడంలేదని మండిపడ్డారట. ఎన్నికల్లో నిధులు కూడా ఒక సామాజిక వర్గం వారికే ఎక్కువ ఇచ్చారంటూ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

"ఒక మీడియా సంస్థ యజమాని చెప్పిన వారికే ఎన్నికల్లో సీట్లు, కోట్లు ఇచ్చారు. సూటు బూటు వేసుకున్న వారికే లోకేష్ ఎక్కువ సమయం ఇచ్చే వారు. కాపులకు సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాలు కూడా ఇవ్వలేదు.. ఉన్నవారిని పక్క నియోజకవర్గలకు మార్చారు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినా.. టీడీపీలో ఉన్న కాపులు పార్టీ మారలేదు. అయినా.. టీడీపీలో కాపులను చంద్రబాబు, లోకేష్ అనుమానంగా చూసే వారు. మీసాల గీతకు సీటు ఇవ్వలేదు.. కదిరి బాబూరావు కు వేరే చోట సీటు ఇచ్చారు." అంటూ ఇలా కాపు నేతలందరూ లోకేష్ ని టార్గెట్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.