చంద్రబాబు భద్రతపై టీడీపీ ఆందోళన.. అలాంటిదేమీ లేదన్న ఏపీ సర్కార్

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి భద్రత తగ్గింపు వ్యవహారం మరోసారి వార్తల్లోకి వచ్చింది. 2019లో అధికారం కోల్పోయిన నాటి నుంచి చంద్రబాబు భద్రతపై పదేపదే జగన్ సర్కారును టార్గెట్ చేస్తున్న టీడీపీ నేతలు మరోసారి ఇదే అంశాన్ని తెరపైకి తెచ్చారు. తమ నేతకు గతంలో ఉన్న 147 మందితో కల్పిస్తున్న భద్రతను తాజాగా 67కు తగ్గించారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు తన తాజా ప్రెస్ నోట్ లో ఆరోపించారు. దీన్ని డీజీపీ కార్యాలయం ఖండించింది. చంద్రబాబు భద్రతలో ఎలాంటి మార్పులు చేయలేదని స్పష్టం చేసింది.

2003లో అప్పటి సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడి కాన్వాయ్ లక్ష్యంగా తిరుపతి అలిపిరి గేటు వద్ద మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఇందులో బాబు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆ తర్వాత అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆయన సెక్యూరిటీని భారీగా పెంచింది. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించడంతో పాటు ఎన్.ఎస్.జి కమాండోలతో అదనపు భద్రతను ఏర్పాటు చేశారు. 2004లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అదికారం కోల్పోయినా ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు మాత్రం దాన్ని యథాతథంగా కొనసాగించాయి. అప్పట్లో చంద్రబాబు కానీ ఆయన పార్టీ నేతలు కానీ వైఎస్ ప్రభుత్వాన్ని మిగతా విషయాల్లో ఇరుకునపెట్టినా భద్రత విషయంలో మాత్రం ఏనాడూ విమర్శలకు దిగలేదు. కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత అధికారం చేపట్టిన రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాల హయాంలో ఆయన కుమారుడు జగన్ భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. అక్రమాస్తుల కేసులో జగన్ ను కోర్టుకు తరలించే వాహనాన్ని సైతం సాధారణ ఖైధీలను తరలించే వాహనాన్ని కేటాయించారు. దీనిపై వైసీపీ కోర్టు దృష్టికి తీసుకురావడంతో అప్పటి కిరణ్ సర్కారు ప్రత్యేక వాహనాన్ని కేటాయించింది. అప్పట్లో ప్రతిపక్షంలో చంద్రబాబు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి తన భద్రతను గాలికొదిలేశారని జగన్ విమర్శలు చేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీ మరోసారి గెలిచాక కూడా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నేతల భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీంతో 2019లో వైసీపీ అదికారంలోకి వచ్చాక చంద్రబాబు విషయంలోనూ అదే తీరుగా వ్యవహరించేందుకు సిద్ధమైంది. ప్రతిపక్ష నేతగా జగన్ కు ఎలాంటి ట్రీట్ మెంట్ ఇచ్చారో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుకూ అదే ట్రీట్ మెంట్ తప్పదని మంత్రులు సైతం వ్యాఖ్యానాలు చేశారు. దీంతో ఆందోళనలో పడిన టీడీపీ.. చంద్రబాబు భద్రతపై హైకోర్టును ఆశ్రయించింది. అక్కడ ప్రభుత్వ వాదనను హైకోర్టు పూర్తిగా అంగీకరించలేదు. దీంతో చంద్రబాబుకు 97 మందితో భద్రత కల్పించాలని హైకోర్టు గతేడాది ఆదేశాలు ఇచ్చింది. ఇందులో జడ్ ప్లస్ కేటగిరీతో పాటు ఎన్ఎస్జీ కమెండోలు కూడా ఉంటారు.

హైకోర్టు ఆదేశాల తర్వాత ప్రభుత్వం చంద్రబాబు భద్రతను కొనసాగించడంతో టీడీపీ కూడా ఆ విషయాన్ని వదిలేసింది. తాజాగా నిన్న టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు చంద్రబాబు భద్రతను 67కు తగ్గించారని ఆరోపిస్తూ ప్రెస్ నోట్ విడుదల చేయడంతో మరోసారి ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. అయితే ప్రభుత్వం మాత్రం టీడీపీ ఆరోపణలను కొట్టి పారేస్తోంది. చంద్రబాబు భద్రతలో తామెలాంటి మార్పులు చేయలేదని డీజీపీ కార్యాలయం స్పష్టత ఇచ్చింది. దేశంలోనే అత్యంత హై సెక్యూరిటీని చంద్రబాబుకు కల్పిస్తున్నామని, ప్రస్తుతం ఆయన జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతోనే ఉన్నారని తెలిపింది. సెక్యూరిటీ కమిటీ సమీక్ష మేరకే నిర్ణయాలు ఉంటాయని క్లారిటీ ఇచ్చింది. అంతటితో ఆగకుండా ప్రస్తుతం చంద్రబాబుకు 183 మందితో భద్రత కల్పిస్తున్నామని తెలిపింది. ఇందులో విజయవాడ నివాసం వద్దనున్న 135 మందితో పాటు హైదరాబాద్ లోని 48 మంది కూడా ఉన్నారని వెల్లడించింది.