72 ఏళ్ల న‌వ‌యువ‌కుడు.. రాజ‌కీయ కురువృద్ధుడు..

ఇటీవ‌ల చంద్ర‌న్న‌ను చూశారా? తిరుప‌తి ఉప ఎన్నిక‌ల్లో ఆయ‌న దూకుడు గ‌మ‌నించారా?.. అదే పంతం.. అదే పోరాటం.. జ‌నం కోసం.. జ‌న‌స్వామ్యం కోసం.. అధికార పీఠంపై అలుపెర‌గ‌ని పోరాటం.. ఉరుములా, ఉప్పెన‌లా ఎగిసిప‌డే సాహ‌సం.. ఆ వ‌య‌సులోనూ న‌వ యువ‌కుడిలా.. యోథుడిలా దండ‌యాత్ర చేస్తున్నారు.. ప్ర‌జ‌ల ప‌క్షాన నిల‌బ‌డితే త‌న‌కు అస‌లు వ‌య‌సే గుర్తుకురాదంటారు.. జ‌గ‌న్‌రెడ్డి దౌర్జన్యాల‌పై చిచ్చ‌ర పిడుగులా చెల‌రేగుతున్న చంద్ర‌న్నకు ఏప్రిల్ 20తో 72 ఏళ్లు వ‌చ్చాయంటే న‌మ్మాల్సిందే.. 

చూట్టానికి ఆయ‌న అంతటి వ‌య‌సు వాడిలా క‌నిపించ‌రు. 40 ప్ల‌స్ ఇయ‌ర్స్ పొలిటిక‌ల్ ఇండ‌స్ట్రీ ఆయ‌న‌ది. ఇందిరాగాంధీతో మొద‌లుపెట్టి.. నేటి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి వ‌ర‌కూ ఎంద‌రినో ఎదిరించి నిలిచిన ధీరుడు చంద్ర‌బాబు. అలుపెర‌గ‌కుండా సాగుతున్న ఆయ‌న‌ రాజ‌కీయ ప్ర‌స్థానంలో జ‌గ‌న్‌లాంటి పిల్ల కాకిల‌ను ఎంద‌రినో చూసిన ఉద్దండుడు. నిన్న కాక మొన్న వ‌చ్చిన‌.. జ‌గ‌నో లెక్కా..?

72 ఏళ్ల చంద్ర‌న్న‌లో క‌నిపించేంత క‌సి.. క‌మిట్‌మెంట్‌.. దేశంలో మ‌రే నేత‌లోనూ క‌నిపించ‌క‌పోవ‌చ్చు. ఆయ‌న ఓ ప్రాంతానికే నాయ‌కుడైనా.. చంద్ర‌బాబు ఇమేజ్‌, క్రేజ్ మాత్రం విశ్వ‌వ్యాప్తం. అమెరికా అధ్య‌క్షుడిని సైతం ఏపీకి ర‌ప్పించిన ఘ‌నుడు. ఐర‌న్ లేడీ ఇందిర‌ను సైతం వెన‌కంజ వేసేలా చేసిన మొన‌గాడు. ముఖ్య‌మంత్రిగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు జ‌రిగిన అన్యాయాన్ని నిల‌దీస్తూ.. ప్ర‌ధాని మోదీపై సైతం ధ‌ర్మ‌యుద్ధం చేసిన యోథుడు. ఎన్టీఆర్‌కు ఆప్తుడిగా మారినా, అల్లుడైనా.. అదే ఎన్టీఆర్‌ను గ‌ద్దె దించి ముఖ్య‌మంత్రి అయినా.. అది చంద్ర‌బాబునాయుడికే సాధ్య‌మైంది. ఆనాడు వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డిని ఎదిరించినా.. ఈనాడు ఆయ‌న త‌న‌యుడితో యుద్ధం చేస్తున్నా.. ఏనాడు అద‌ర‌లేదు.. బెద‌ర‌లేదు.. వెన‌క్కి త‌గ్గ‌లేదు. 15 ఏళ్లు ముఖ్య‌మంత్రిగా, 10 ఏళ్లు ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా.. చంద్ర‌బాబు రాజ‌కీయ జీవితం స‌మోన్న‌తం. 

1950, ఏప్రిల్ 20న చిత్తూరు జిల్లా నారావారిప‌ల్లెలో జ‌న్మించిన ఓ సామాన్యుడు.. ఇవాళ ఇంత‌టి అస‌మాన్యుడిగా ఎదుగుతాడ‌ని అప్ప‌డు ఎవ‌రికీ తెలీదు. ఎస్వీ యూనివ‌ర్సిటీలో అర్థ‌శాస్త్రంలో పీజీ చేసిన చంద్ర‌బాబు.. ఆ త‌ర్వాత రాష్ట్ర ఆర్థిక లెక్క‌ల‌న్నిటినీ స‌రి చేసి తిర‌గ రాస్తార‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. విద్యార్థి నాయ‌కుడిగా యువ‌జ‌న కాంగ్రెస్‌లో రాజ‌కీయంగా తొలి అడుగు వేశారు. ఆ త‌ర్వాత ఇక రాజ‌కీయంగా తిరిగి చూడాల్సిన అవ‌స‌రం రాలేదు.  1978లో చంద్ర‌గిరి నుంచి గెలిచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఏ అసెంబ్లీ భ‌వ‌నంలోనైతే ఆయ‌న మైకు ప‌ట్టుకొని.. అధ్య‌క్షా అన్నారో.. ఆ త‌ర్వాత కాలంలో అదే అసెంబ్లీలో ముఖ్య‌మంత్రిగా ప‌దేళ్లు ఉన్నారు. త‌న 28వ ఏట‌నే అంజ‌య్య ప్ర‌భుత్వంలో సినిమాటోగ్ర‌ఫీ మంత్రిగా ప‌ని చేశారు. ఆ స‌మ‌యంలోనే ఎన్టీఆర్‌కు స‌న్నిహితుడిగా మార‌డం, ఆయ‌న కుమార్తె భువ‌నేశ్వ‌రిని వివాహం చేసుకోవ‌డంతో.. చంద్ర‌బాబు రాజ‌కీయ జీవితం మ‌రో మ‌లుపు తిరిగింది. 

1983లో ఎన్టీఆర్ ప్ర‌భంజ‌నంలో చంద్ర‌గిరి నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థిగా ఓడినా.. ఆ త‌ర్వాత టీడీపీలో చేరి అన‌తి కాలంలోనే పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స్థాయికి ఎదిగారు. నాదెండ్ల భాస్క‌ర‌రావు కుతంత్రాన్ని చంద్ర‌బాబు త‌న చాణ‌క్యంతో చేధించిన తీరు.. ఆయ‌న్ను రాజ‌కీయ చాణ‌క్యుడిలా నిల‌బెట్టింది. నేష‌న‌ల్ ఫ్రంట్ స‌మ‌యంలో జాతీయ నేత‌గా ఎదిగారు. ఇక 1994లో ల‌క్ష్మీ పార్వ‌తి ఎంట్రీ టీడీపీలో సంక్షోభానికి కార‌ణ‌మైంది. 

1995లో ఎన్టీఆర్‌ను దింపేసి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు చంద్ర‌బాబు. కొందరు దాన్ని ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా జరిగిన కుట్ర అంటారు. మరికొందరు పార్టీని కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నంగా చెబుతారు. చంద్ర‌బాబు  సీఎం అవ‌డం ఒక చారిత్ర‌క అవ‌స‌రంగా మారింది. అప్ప‌టి వ‌ర‌కూ కాంగ్రెస్ పాల‌న‌లో పేరుకుపోయిన వ్య‌వ‌స్థ‌లోని బూజును.. ముఖ్య‌మంత్రిగా మూన్నాళ్ల‌లోనే దులిపేశారు. ప‌దేళ్ల పాటు ముఖ్య‌మంత్రిగా కొన‌సాగారు. రోజుకు 20గంట‌ల పాటు ప‌ని చేసి.. ఏపీ అభివృద్ధిలో కొత్త చ‌రిత లిఖించారు చంద్ర‌బాబు. విజ‌న్ 2020కి ఆయ‌నే రోల్ మోడ‌ల్‌.. బ్రాండ్ అంబాసిడ‌ర్‌.

ప్రజల వద్దకు పాలన, జన్మభూమి, శ్రమదానం, క్లీన్ & గ్రీన్, మీ సేవ‌, రైతు బ‌జార్‌.. లాంటి వాటితో న‌వ వ‌సంతం తీసుకొచ్చారు. దేశానికే ఆద‌ర్శ సీఎంగా నిలిచారు. హైద‌రాబాద్‌ను హైటెక్ సిటీగా మార్చినా.. కొత్త‌గా సైబ‌రాబాద్ నిర్మించినా.. అది చంద్ర‌బాబు దార్శ‌నిక‌తే. ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా రాష్ట్ర ప్ర‌యోజ‌నాలే ముఖ్య‌మంటూ ఏపీకే ప‌రిమిత‌మ‌య్యారు. 

2004 త‌ర్వాత వైఎస్సార్‌కు ఎదురు నిలిచి.. ప‌దేళ్లు ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా పోరాడారు. 60 ఏండ్ల వయసులోనూ రాష్ట్రమంతా పాదయాత్ర చేశారు. ఆ వయసులో పాదయాత్ర చేస్తున్న చంద్రబాబును చూసి అంతా షాకయ్యారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత న‌వ్యాంధ్ర‌ను స‌న్‌రైజ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌గా రూపొందించేందుకు గ‌ట్టి ప్ర‌య‌త్నం చేశారు. అంత‌ర్జాతీయ స్థాయిలో ఆంధ్రుల క‌ల‌ల‌ రాజ‌ధాని అమ‌రావ‌తిని క‌ట్టేందుకు అడుగులు వేశారు.  ఒక్క ఛాన్స్ అంటూ అంద‌ల‌మెక్కిన జ‌గ‌న్‌.. ఏపీ క‌ల‌ల సౌధాన్ని కూల్చివేయ‌గా.. రాజ‌ధానిని మూడు ముక్క‌లు చేయ‌గా.. సంక్షేమ ప‌థ‌కాల‌తో రాష్ట్రాభివృద్ధిని తూట్లు పొడ‌వ‌గా.. ఆ జ‌గ‌న్‌రెడ్డి అరాచ‌కాల‌కు వ్య‌తిరేకంగా.. 72 ఏళ్ల వ‌య‌సులో.. న‌వ యోథుడిలా పోరాటం చేస్తున్నారు నారా చంద్ర‌బాబునాయుడు. ఈ రాజ‌కీయ కుర‌వృద్ధుడిలో నేటికీ నాటి ఉరిమే ఉత్సాహ‌మే.