సర్వే రిపోర్ట్: టీడీపీ-బీజేపీ మిత్రలాభం!

 

 

 

ప్రస్తుతం ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలు ఏ క్షణంలో అయినా వచ్చేట్టున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ జనతాపార్టీ అగ్ర నాయకుడొకరు లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండొచ్చనే అంశం మీద సర్వే జరిపించినట్టు తెలిసింది. ఈ సర్వే భారతీయ జనతాపార్టీ పరంగా కాకుండా ఆ నాయకుడు వ్యక్తిగత ఆసక్తితో జరిపించారని తెలిసింది. విశ్వసనీయ సంస్థలతో జరిపించిన ఆ సర్వేలో దేశవ్యాప్తంగా భారతీయ జనతాపార్టీ పుంజుకుందన్న విషయం స్పష్టమైంది.

 

అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని 42 లోక్‌సభ స్థానాల విషయంలో ఆసక్తికరమైన అంశాలను సర్వే బయటపెట్టింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, రాష్ట్రంలో పార్టీలన్ని ఎలాంటి పొత్తులూ లేకుండా విడివిడిగా పోటీ చేస్తే తెలుగుదేశం-17, వైఎస్సార్సీపీ-11, టీఆర్ఎస్-7, బీజేపీ-3, కాంగ్రెస్-3, ఎం.ఐ.ఎం.-1 స్థానాలలో విజయం సాధించే అవకాశం వుందని తేలింది. కాంగ్రెస్ పార్టీకి సీమాంధ్రలో ఒక్క లోక్‌సభ స్థానం కూడా దక్కదన్న విషయం స్పష్టమైంది. తెలుగుదేశం పార్టీకి అటు సీమాంధ్రలోనూ, ఇటు తెలంగాణలోనూ మంచి ఆదరణ లభించనుందని ఈ సర్వే స్పష్టం చేసింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ప్రాంతంలో టీడీపీకి ఎంత వ్యతిరేకంగా ప్రచారం చేసినప్పటికీ ఆ ప్రాంతంలో టీడీపీకి 4 నుంచి 5 లోక్‌సభ సీట్లు రానున్నాయి. తెలంగాణ ప్రాంతంలో టీడీపీ బలంగా వుండటానికి గల కారణాలను కూడా ఆ సర్వే విశ్లేషించింది.




తెలంగాణ ప్రాంతంలో టీడీపీకి బలమైన కేడర్ వుండటం, 35 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సెటిలర్స్ ప్రభావం బాగా వుండటం, అలాగే 35 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో తెలంగాణ ఉద్యమం లేకపోవడం వల్ల ఆ ప్రభావం టీడీపీకి లభించే లోక్‌సభ సీట్ల సంఖ్యపై కనిపించనుంది. ఈ ఎన్నికలలో భారతీయ జనతాపార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునే పక్షంలో రెండు పార్టీలకూ కలిపి ఇప్పుడు గెలిచే స్థానాలకంటే మరో ఆరు స్థానాలు ఎక్కువగా గెలిచే అవకాశం వుందని ఆ సర్వే వెల్లడించింది. ప్రస్తుతం బీజేపీ దేశవ్యాప్తంగా ఒంటరిగా పోటీ చేసిన పక్షంలో కేంద్రంలో హంగ్ వచ్చే అవకాశం వుందని, అందువల్ల భావసారూప్యం వున్న ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవడం వల్ల బీజేపీకి మేలు జరగడంతోపాటు హంగ్ లాంటి ప్రమాదకర పరిణామాలను నివారించవచ్చని ఆ సర్వే పేర్కొంది.




బీజేపీ అగ్ర నాయకుడు చేయించిన ఈ సర్వే నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీ, టీడీపీల మధ్య పొత్తు కుదిరే అవకాశాలు వున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. యువతరంలో బీజేపీకి భారీ మద్దతు వుందని సర్వేలో తేలింది. రాష్ట్రంలో కూడా యువతరం నుంచి మంచి మద్దతు పొందుతున్న పార్టీగా టీడీపీ నిలిచింది. ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరితే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, దేశానికి కూడా మేలు చేసే అవకాశం వుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.