రెండు మానిఫెస్టోల సిద్ధాంతం

 

ఎన్నికల వేళ టీడీపీ తన ప్రత్యేకతను మరోసారి చాటుకుంది. రెండు ప్రాంతాల అవసరాలు, ప్రజాభిప్రాయాలు, అవకాశాలకు తగ్గట్టు రెండు మేనిఫెస్టో లు విడుదల చేసింది. అవశేష ఆంధ్రప్రదేశ్ గర్వించే రాజధాని నిర్మాణం మేనిఫెస్టో లో అగ్రభాగాన ఉంది. వ్యవసాయ, డ్వాక్రా రుణాల మాఫీ, పించన్ పెంపు, నాణ్యమైన విద్యుత్ సరఫరా, పేదపిల్లలకు కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య, మహిళల భద్రతకు ప్రత్యేక వ్యవస్థ, బెల్ట్ షాపుల రద్దు, ఎన్టీఅర్ హెల్త్ కార్డులతో ఉచిత వైద్యంతోపాటు సీమాంధ్ర ఓటర్లను ఆకట్టుకునేలా మేనిఫెస్టో లో వరాలు పొందుపరిచారు బాబు.

 

తెలంగాణకు వచ్చేసరికి దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్నిచర్యలూ తీసుకుంటామని మేనిఫెస్టో లో హామీలు గుప్పించారు. విద్యుత్ కోతలు అధిగమించడం, సాగునీటి సమస్యల పరిష్కారం, అమరుల కుటుంబ సభ్యులకు ఉద్యోగం, పరిహారం, ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత, పరిశ్రమలకు ప్రోత్సాహంతోపాటు మరిన్ని వరాలు తెలంగాణా ఎన్నికల ప్రణాళికలో ఉన్నాయి.

 

రాష్ట్ర విభజనకు ముందు రెండు ప్రాంతాలు తనకు సమానమే అని ప్రకటించిన బాబు ఎన్నికల మేనిఫెస్టో రూపొందించడంలోనూ ఇరు ప్రాంతాలకు సమాన ప్రాధాన్యం ఇచ్చి మరో సారి తన సమ న్యాయ సిద్ధాంతాన్ని ప్రజల ముందుంచారు.