తెలంగాణాలో తెదేపా పరిస్థితి చక్కదిద్దేదెన్నడు?

 

రాష్ట్ర విభజన చేసి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని తుడిచిపెట్టేయాలని కాంగ్రెస్ అధిష్టానం కుట్ర పన్నిందని ఇంతకాలంగా చంద్రబాబు నాయుడు చెపుతున్నమాటలు ఇప్పుడు క్రమంగా వాస్తవ రూపం దాల్చుతున్నాయి. తెలంగాణా ఉద్యమం పతాక స్థాయిలో జరుగుతున్న సమయంలో కూడా పార్టీని వీడని తెదేపా తెలంగాణా నేతలు, విభజన ప్రకటన వెలువడిన తరువాత నుండి క్రమంగా తెరాసవైపు మళ్ళుతున్నారు. ఇప్పుడు రాష్ట్ర విభజన కూడా జరిగిపోయింది గనుక మరికొంతమంది తెలుగు తమ్ముళ్ళు విజయోత్సాహంతో ఉన్న తెరాస వైపు మళ్ళుతున్నారు. మహేందర్ రెడ్డి (తాండూరు శాసనసభ్యుడు) కే.యాన్. రత్నం(చేవెళ్ళ);నరేంద్ర రెడ్డి (యంయల్సీ)లు ఇటీవల తెరాసలో చేరేందుకు సిద్దం అయ్యారు. వీరు గాక వరంగల్, మెహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన తెలుగు తమ్ముళ్ళను కూడా పార్టీలోకి ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవేళ కాంగ్రెస్-తెరాసల విలీనం లేదా పొత్తులు ఖరారవగానే మరికొందరు తెలుగు తమ్ముళ్ళు తెరాస వైపు దూకేయవచ్చును.

 

చంద్రబాబు నాయుడు తెలంగాణాలో కూడా తమ పార్టీయే విజయం సాధిస్తుందని ఎంత ధీమా వ్యక్తం చేస్తున్నా పరిస్థితి ఇలాగే కొనసాగితే తెలంగాణాలో పార్టీ ఖాళీ అయిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయన ఇటీవల తెలంగాణా తెలుగు తమ్ముళ్ళతో సమావేశమయ్యి వారికి దిశా నిర్దేశం చేసారు. కానీ, తెలంగాణాలో తెదేపాను పూర్తిగా తుడిచిపెట్టేయాలని చూస్తున్న కాంగ్రెస్-తెరాసలను ఎదుర్కొనేందుకు ఆయన తన సీనియర్ నేతలతో కలిసి చాలా గట్టి ప్రయత్నాలు వెంటనే చేయవలసి ఉంది. లేకుంటే తెదేపాకు ఇప్పుడున్న సీట్లు దక్కడం కూడా కష్టమవుతుంది. పైగా ఈలోగా పార్టీ ఖాళీ అయిపోయే ప్రమాదం కూడా ఉంది.

 

పార్లమెంటులో తెలంగాణా బిల్లు ఆమోదం పొందిన తరువాత టీ-కాంగ్రెస్, తెరాస, బీజేపీలు తెలంగాణాలో విజయోత్సవాలు నిర్వహిస్తూ దూసుకుపోతూ, తెలంగాణా తెచ్చిన ఖ్యాతిని స్వంతం చేసుకొనే ప్రయత్నాలు చేస్తుంటే, తేదేపాకు చెందిన సీనియర్ తెలంగాణా నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, మోత్కుపల్లి, రేవంత్ రెడ్డి వంటివారు అడుగు ముందుకు వేయలేని పరిస్థితిలో పార్టీ కార్యాలయానికే పరిమితమయిపోయారు. తెలంగాణా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీయే స్వయంగా “తెలుగుదేశం పార్టీ లేఖ ఇచ్చినందునే తెలంగాణా రాష్ట్రం ఏర్పడిందని” ప్రకటిస్తున్నపటికీ, తెదేపా తెలంగాణా నేతలు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. బహుశః ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వెనక్కి తగ్గినట్లున్నారు. కానీ, వారు ఇంకా ఇదే సంకట స్థితిలో మరికొంత కాలం కొనసాగినట్లయితే, ఈలోగా వారికి, పార్టీకి కూడా కోలుకోలేనంత నష్టం జరిగే అవకాశం ఉంది.

 

కాంగ్రెస్ పార్టీ ఏవిధంగా ఇప్పుడు సీమాంధ్రపై దృష్టి కేంద్రీకరించి పార్టీని బ్రతికించుకోవాలని ప్రయత్నిస్తోందో అదేవిధంగా సీమాంధ్రలో బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఇప్పటికయినా మేల్కొని తెలంగాణాపై దృష్టి కేంద్రీకరించవలసి ఉంది. లేకుంటే చంద్రబాబు జోస్యం నిజమయ్యే అవకాశం ఉంటుంది.