తెదేపా ఆంధ్ర, తెలంగాణా శాఖలకు శ్రీకారం?

 

రాష్ట్ర విభజన అనివార్యమని తెలియడంతో తెలుగుదేశం పార్టీ రెండు రాష్ట్రాలకు విడివిడిగా పార్టీ శాఖలను ఏర్పాటు చేసేందుకు కసరత్తు మొదలుపెట్టక తప్పలేదు. నిన్న ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన పార్టీ నేతలతో సమావేశమయ్యి ఈ విషయమపై చర్చించారు. కాంగ్రెస్ అధిష్టానం తన రాజకీయ ప్రత్యర్ధులను అన్నివిధాల దెబ్బతీసేందుకే ఎన్నికలు దగ్గిరపడేవరకు ఈ విభజన వ్యవహారాన్ని సాగదీసుకొంటూ వచ్చిందని, ఇంకా ఆలస్యం చేసినట్లయితే, ఒకవేళ కాంగ్రెస్ మరేదయినా నక్కజిత్తులు ప్రదర్శిస్తే ఎన్నికలకు సిద్దం అవడానికి కూడా ఇక సమయం మిగలకపోవచ్చని, అందువలన వెంటనే ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాలకు ప్రత్యేక శాఖల ఏర్పాటు చేయవలసిందిగా తెదేపా నేతలు ఆయనను కోరినట్లు సమాచారం. అందుకు కోసం మొదట రెండు కమిటీలను నియమించేందుకు చంద్రబాబు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం.

 

పార్టీకి చెందిన ఆంధ్ర, తెలంగాణా నేతలతో మళ్ళీ త్వరలోనే విడివిడిగా సమావేశమయ్యి కమిటీలో సభ్యుల పేర్లను, కమిటీల విధివిధానాలను ఖరారుచేసే అవకాశాలున్నాయి. నిన్న జరిగిన సమావేశంలో ఉభయ ప్రాంతాలకు చెందిన సీనియర్‌ నేతలు అందరూ పాల్గొన్నారు. ఒకవేళ తెలుగుదేశం రెండు రాష్ట్రాలలో ప్రత్యేక శాఖలు ఏర్పాటు చేసుకోవాలంటే, ముందుగా ఆ పార్టీని జాతీయపార్టీగా మార్చుకొని ఎన్నికల సంఘం వద్ద నమోదు చేయించుకోవలసి ఉంటుంది. ఆ తరువాత రెండు రాష్ట్రాలలో శాఖలకు విడివిడిగా పార్టీ అధ్యక్షులను, కార్యవర్గాలను ఏర్పాటు చేసి, చంద్రబాబు ఆ రెండింటికి జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చెప్పట్టవలసి ఉంటుంది.

 

ఈ సమావేశంలో వారు బీజేపీతో పొత్తుల వ్యవహారంపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. వారిలో బీజేపీతో ఎన్నికల పొత్తులకు మొదట సానుకూలంగా ఉన్న సీమాంధ్ర నేతలు ఇప్పుడు వ్యతిరేఖించగా, తెలంగాణా నేతలు పొత్తులు పెట్టుకోవాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈరోజు బీజేపీ రాజ్యసభలో టీ-బిల్లుపై వ్యవహరించిన తీరుని బట్టి ఆ పార్టీతో ఎన్నికల పొత్తులు పెట్టుకోవాలా లేదా? అనే సంగతి నిర్ణయించుకోవడం మేలని వారు భావించినట్లు తెలుస్తోంది.