కాంగ్రెస్ వ్యూహంతో తెదేపా-బీజేపీలు కటీఫ్

 

లోక్ సభలో నిన్న తెలంగాణా బిల్లు ఆమోదం పొందింది గనుక ఇక ఈరోజు రాజ్యసభకు వెళుతుంది. బీజేపీ కూడా బిల్లుకి మద్దతు ఇస్తునందున ఇక రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందడం కేవలం లాంచనప్రాయమే. కాంగ్రెస్ పార్టీలో తెరాస విలీనానికి ఆ పార్టీ అధినేత కేసీఆర్ అంగీకరించినట్లు సమాచారం. కనుక కాంగ్రెస్, తెరాస నేతలమధ్య పదవులు, టికెట్స్ పంపకాలు పూర్తి చేసుకొనగానే, అందరూ కాంగ్రెస్ కండువాలు కప్పుకొని తమ ప్రధాన ప్రత్యర్దులయిన తెదేపా, బీజేపీలపై యుద్ధం ప్రకటిస్తారు. బీజేపీ విషయానికి వస్తే విభజనకు సహకరించినప్పటికీ ఆ ప్రయోజనమంతా తెరసకి అది కాంగ్రెస్ లో విలీనమయితే కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది తప్ప బీజేపీకి ఒరిగేదేమీ ఉండదు.

 

రాష్ట్ర విభజన దెబ్బతో తెలంగాణాలో డీలాపడిన తెదేపా, అందుకు సహకరించిన బీజేపీతో పొత్తులు పెట్టుకొంటే ఆ ప్రభావం సీమాంధ్రలో తీవ్రంగా ఉంటుంది గనుక ఒంటరిపోరుకే సిద్దపడవచ్చును. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్, తెరాసలు చేతులు కలిపినట్లయితే విజయోత్సాహంతో ఉన్నవారిని ఎదుర్కొని ఓడించడం తెదేపా, బీజేపీల వల్ల కాదు.

 

కాంగ్రెస్ విసిరిన గాలానికి చిక్కుకొన్న బీజేపీ రెండు ప్రాంతాలలో నష్టపోవడమే కాకుండా, తెదేపాను కూడా పోగ్గోట్టుకొనే అవకాశం ఉంది. ఎన్నికల తరువాత కేంద్రంలో అధికారం దక్కించుకోవాలని ఉవ్విళ్ళూరుతున్న బీజేపీ, ఇటువంటి కీలక సమయంలో దక్షిణాదిన ఉన్న ఏకైక మిత్రపార్టీ తెదేపాను పోగొట్టుకొంటే ఆ నష్టం తిరిగి ఎన్నడూ పూడ్చుకోలేదు. ఒకవేళ చంద్రబాబు థర్డ్ ఫ్రంట్ కి మొగ్గు చూపినట్లయితే, ఇక బీజేపీకి ఎదురీత తప్పకపోవచ్చును. బహుశః విభజన ద్వారా కాంగ్రెస్ ఆశించిన అనేక ప్రయోజనాలలో తెదేపా-బీజేపీలను దూరం చేయడం, తద్వారా రాష్ట్రంలో తెదేపాను, జాతీయ స్థాయిలో బీజేపీని బలహీనపరచడం కూడా ఒకటయి ఉండవచ్చును.

 

అయితే ఇంతవరకు చంద్రబాబు కానీ, ఆ పార్టీ సీనియర్ నేతలు గానీ బిల్లు ఆమోదంలో బీజేపీ పాత్రపై పెదవి విప్పలేదు. బహుశః ఈ రోజు రాజ్యసభలో బిల్లుపై బీజేపీ వ్యవహరించిన తీరు చూసిన తరువాత చంద్రబాబు బీజేపీతో పొత్తులపై విస్పష్టమయిన ప్రకటన చేయవచ్చును. అయిది, బీజేపీ ఇప్పుడు రాజ్యసభలో బిల్లుని ఎంతగా వ్యతిరేఖించినప్పటికీ బిల్లు ఆమోదం పొందడం లాంచనమే గనుక, బహుశః తెదేపా ఆ పార్టీతో ఎన్నికల పొత్తులను నిరాకరించవచ్చును.